సీఎస్‌పీ కాట వద్ద రహదారికి గ్రహణం!

06-10-2026 | 05:05am
  1. లారీల మకాంగా ప్రధాన రహదారి..
  2. దుమ్ముతో ప్రజల ఉక్కిరిబిక్కిరి 
  3. నో పార్కింగ్ బోర్డు ఎక్కడ...?
  4. పోలీసుల హెచ్చరికలు గాలికేనా...?

మణుగూరు, అక్టోబర్ 5,(విజయక్రాంతి): మణుగూరు భద్రాచలం ప్రధాన రహదారిపై(Manuguru-Bhadrachalam Main Road) సీఎస్పీ కాట సమీపంలో సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో లారీలు(Lorries) నిలిపి వేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు రహదారిపైనే(Lorries on the road) గంటల తరబడి నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు లారీల రాకపోకలతో రహదారిపై పేరుకుపోయిన దుమ్ము గాలిలోకి ఎగసిపడుతోంది. బొగ్గు ధూళి, మట్టి దుమ్ముతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దుమ్ము కారణంగా ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. సీఎస్పీ కాట వద్ద నిత్యం భారీ వాహనాల రద్దీ ఉన్నప్పటికీ తగిన నియంత్రణ చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లారీలను క్రమబద్ధంగా నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు కానీ, అమలు చేయడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలం అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిని లారీలు ఆక్రమించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు కానీ, కంటికి కానరాకుండా పోయాయి. నిరంతరం ఇసుక బొగ్గు లారీలు పట్టణం గుండా రాకపోకలు సాగిస్తున్నాడంతో రాత్రి సమయంలో చిన్న వాహనాలకు దారి కూడా కనపడకుండా దుమ్ముతో అలముకుపోతుంది.

అదేవిధంగా రహదారిపై పేరుకుపోయిన దుమ్మును ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు. నీటిని పిచికారీ చేసి దుమ్ము సమస్యను తాత్కాలికంగా నియంత్రించాలని ప్రజలు సూచిస్తున్నారు. రహదారిపై లారీల మకాం కొనసాగితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రద్దీ సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

ప్రధాన రహదారిపై లారీల నిలుపుదలకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎస్పీ కాట వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దుమ్ము కాలుష్యంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం జరిగే పరిస్థితులు రాకముందే అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు. సీఎస్పీ కాట వద్ద రహదారి పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

లారీలకు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలం చూపించి ప్రధాన రహదారిని ఖాళీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్, కాలుష్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారా.. లేక ప్రమాదం జరిగిన తర్వాత మేల్కొంటారా అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు