జన్వాడలో భారీ అక్రమ కట్టడాలు ధ్వంసం
111 జీవో పరిధిలో వెంచర్‌ను ధ్వంసం చేసిన అధికారులు
శంకర్‌పల్లి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): జన్వాడలో 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా వెంచర్లను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగ్ డివిజన్ సిటీ ప్లానర్ ప్రసిద్ధ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమేష్, హెచ్‌ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేతలు నిర్వహించారు .
జన్వాడ గ్రామంలో ఇలాంటి అనుమతులు లేకుండా నాలా కన్వర్షన్ చేయకుండా కొందరు అక్రమార్కులు 60 ఎకరాలకు పైగా స్థలంలో వెంచర్ ను ఏర్పాటు చేసి అందులో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకొని వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పొందుపరిచారు. చాలా రోజుల క్రితం ఈ వ్యవహారం నడుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ విషయమై ఇటీవల మీడియా కథనాలు వెలు వడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం టౌన్ ప్లానింగ్ విభాగం, ఇతర ఉన్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో వెంచర్ ను సందర్శించి వివరాలను సేకరించారు.
నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేతలు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా చేవెళ్ల ఆర్డిఓ పార్థ సింహారెడ్డి, ఆర్ ఐ తేజ, ఇరిగేషన్ డి ఈ జలంధర్, ఏ ఈ సౌజన్య, ఇతర అధికారులు జన్వాడలో భారీ వెంచర్ను సందర్శించారు. అనుమతులు లేకుండా ఎలా వెంచర్ ఏర్పాటు చేశారని నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 111 జీవో పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ హెచ్చరించారు.
తాజాగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగ్ డివిజన్ సిటీ ప్లానర్ ప్రసిద్ధి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమేష్, హెచ్‌ఎండిఏ వింగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా జెసిబి ల సహాయంతో వెంచర్ లోని పిల్లర్లను, ప్రహరీ గోడలను కూల్చివేశారు. 111 జీవో పరిధిలో ఇటువంటి కట్టడాలు నిర్వహించిన, ఫిరంగినాలను కబ్జా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
