మున్సిపల్ నిబంధనలు బేఖాతర్.. బిర్యానీ విక్రయాలు
- గాంధీ జయంతి రోజున కోదాడలో యథేచ్ఛగా చికెన్ బిర్యానీ అమ్మకాలు.
- అధికారుల ఆదేశాలు అమలయ్యాయా.?
కోదాడ అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా పట్టణంలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ.. కోదాడలో పలుచోట్ల చికెన్, మటన్, బిర్యానీ విక్రయాలు కొనసాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మాంసాహార దుకాణాల యజమానులకు అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేశారా? నోటీసులు ఇచ్చినట్లయితే నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ఎలా కొనసాగాయి? అనే ప్రశ్నలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి.
నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? ఉల్లంఘనలకు పాల్పడిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.గాంధీ జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో నిబంధనలు పక్కాగా అమలయ్యేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. బహిరంగంగా విక్రయాలు కొనసాగినట్లు ఆరోపణలు రావడం చర్చకు దారితీస్తోంది. నిషేధ ఆదేశాలు కేవలం నోటీసులకే పరిమితమయ్యాయా? క్షేత్రస్థాయిలో అమలు ఎందుకు కనిపించలేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అధికారులు స్పందిస్తారా.?
నిబంధనల ఉల్లంఘనలపై మున్సిపల్ అధికారులు వాస్తవ పరిస్థితులను వెల్లడించి.. ముందస్తు నోటీసులు ఇచ్చారా తనిఖీలు నిర్వహించారా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారా అనే వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.