19న కోదాడలో మెగా జాబ్‌మేళా

11-09-2026 | 05:00am
  1.   200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానిస్తాం
  2. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
  3. ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : యువత(Youth)కు ఉద్యోగావకాలు(Job Opportunities) కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్‌మేళా(Mega Job Fair) నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(N Uttam Kumar Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటతోపాటు అటు ఖమ్మం, ఇటు నల్లగొండ జిల్లా(Nalgonda District)ల్లోని యువతకు ఈ మేళాలో అవకాశాలు దక్కనున్నాయని అన్నారు. 200 నుంచి 250 కంపెనీలను ఈ మేళాకు ఆహ్వానించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

మెగా జాబ్‌మేళా(Mega Job Fair) ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతీ రెడ్డి, సూర్యాపేట కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులతో మేళా నిర్వహణపై చర్చించారు. నేడు సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో నిరుద్యోగం ఒకటని మంత్రి పేర్కొన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పైనే ఉంటుందన్నారు.

అదే ఈ జాబ్‌మేళా ప్రధాన ఉద్దేశమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పందన లభించిందని మంత్రి గుర్తు చేశారు. 19న నిర్వహించే మేళాకు కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల యువతను విస్తృతంగా సమీకరించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలో కూడా ఈ మేళాపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.

ఇంజినీరింగ్ , పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సైతం ప్రోత్సహించాలని సూచించారు. కంపెనీలతో సమన్వయం, అభ్యర్థుల సమీకరణ, నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు వంటి బాధ్యతలను ప్రత్యేక బృందాలకు అప్పగించాలని ఆదేశించారు. కోదాడలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌ను మెగా జాబ్‌మేళా వేదికగా ఖరారు చేసినట్లు వెల్లడించారు.

అభ్యర్థుల నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వాహనాల పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మేళాకు హాజరై ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ మెగా జాబ్ మేళాను ప్రభుత్వ కార్యక్రమంగా, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు చురుగ్గా పాల్గొని, కార్యక్రమ విజయాన్ని సమష్టి బాధ్యతగా స్వీకరించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు