ప్రతి సమస్యను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలి...

02-10-2026 | 03:53pm
  1. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకం..
  2. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, అక్టోబర్02( విజయక్రాంతి ): జాతిపిత మహాత్మా గాంధీ(Father of the Nation Mahatma Gandhi)  జయంతి సందర్భంగా ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ అధ్యక్షతన ఉట్నూర్ మేచర్ గ్రామపంచాయతీ పరిధిలోని  రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభ కు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel)ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

గాంధీజీ సత్యం, అహింసతో పాటు గ్రామ స్వరాజ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే  గుర్తు చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమస్యలను గ్రామసభలో చర్చించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతలు, ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని అన్నారు.

పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి అవకాశాలు తదితర అంశాల్లో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కూడా గ్రామసభ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ  ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శంకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు