సీఎం కొత్తగా చేసిందేమిటి?

01-10-2026 | 05:05am

కేసీఆర్ కట్టిన భవనాలకే రిబ్బన్ కటింగ్ 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజురాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో నిర్మించిన భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం తప్పా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(MLA Padi Koushik Reddy) ప్రశ్నించారు. కరీంనగర్ కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మిస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించారని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం కాకుండా కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, కమలాపూర్ బస్టాండ్ మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాకు వచ్చిన సీఎం.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు.

వీణవంక మండలంలో ఇసుక క్వారీల భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డిపల్లి కల్లుపల్లి వీణవంక రహదారులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి, తన నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ అలాంటి అభివృద్ధి చేపట్టాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. 

మరిన్ని వార్తలు