6 September, 2026 | 8:31 AM

మొబైల్‌లో మోటర్ స్విచ్!

06-09-2026 | 05:10am

శాస్త్ర సాంకేతికత అన్ని రంగాలకు విస్తరించుకుంటోంది. వ్యవసాయ రంగంలోనూ(Agricultural Sector) పెరుగుతూ వస్తోంది. పురుగు మందులు, ఎరువులను పంటల్లో చల్లడానికి డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. తాజాగా రైతులు ఉన్న చోటి నుండే ఆన్‌లైన్ ద్వారా పొలం వద్దగల మోటార్ ఆన్ ఆఫ్ చేస్తూ నీరు పారిస్తున్నారు. కేవలం నెలకు రూ.200ల రీఛార్జ్‌తో వ్యవసాయ బావి మోటర్‌ను సెల్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే రైతులు ఆటోమేటిక్ డిజిటల్ మొబైల్ స్టార్టర్ ఏర్పాటు అరచేతితో కరెంట్ మోటర్‌ను నడిపిస్తున్నారు. 

రూ.4,500 నుంచి మొదలుకొని రూ.8500 ధరతో మార్కెట్లలో డిజిటల్ ఆటోమేటిక్ మొబైల్ విద్యుత్ స్టార్టర్లు లభ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఆధునిక మొబైల్ స్టార్టర్‌కు ప్రత్యేకంగా సిమ్ ఏర్పాటు చేసి నెలకు రూ. 200ల రీఛార్జ్‌తో ఆన్లైన్ యాప్ ద్వారా సెల్‌ఫోన్‌తో చెలకలకు నీరు పారించుకోవచ్చు. 

నొక్కు నొక్కితే చాలే!

సెల్ ఫోన్‌కు విద్యుత్ స్టార్టర్‌కు బిగించిన సిమ్‌కు యాప్ ద్వారా అనుసంధానిస్తారు. దీంతో సులువుగా ఫోన్ ద్వారా కరెంట్ మోటార్‌ను ఎక్కడున్నా ఆపరేట్ చేయొచ్చు. ఫోన్‌లో 1 నొక్కితే ఆన్, 3 నొక్కితే మోటర్ ఆఫ్ అవుతుందని రైతులు చెబుతున్నారు. ఒక వేళ బావిలో నీరు అడుగంటితే మోర్ ఆటోమేటిక్‌గా బంద్ అవుతుంది. విద్యుత్ సరఫరాలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా మోటర్ దానంతట అదే బంద్ అవుతుంది. ఆ సమాచారాన్ని కూడా  రైతు ఫోన్లకు చేరవేస్తుంది. రైతులకు ఉపయోగకరంగానే కాకుండా విద్యుత్ మోటర్లకు రక్షణగా ఈ డిజిటల్ సిస్టమ్ పని చేస్తుండడంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

చాలా ఇబ్బందులు తొలిగిపోయాయి

మొబైల్ విద్యుత్ స్టార్టర్ వల్ల అనేక ఇబ్బందులు తొలిగిపోయాయి. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతాయనే భయం పోయింది. రాత్రిపూట బావి వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ప్రత్యేకంగా నీళ్లు పారించడానికి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అయింది.  

 మోహన్ రెడ్డి, రైతు, ఉప్పరపల్లి, మహబూబాబాద్ 

మరిన్ని వార్తలు