ఐఐఎంసీ కళాశాలలో జాతీయ సదస్సు
విజయవంతంగా నిర్వహణ
ఖైరతాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఖైరతాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్(Indian Institute of Management and Commerce) స్వయం ప్రతిపత్తి కళాశాల, తెలంగాణ కామర్స్ అసోసియేషన్(టీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఐఐఎంసీలోని చల్లా సోమరాజ్ రామ్ ఆడిటోరియంలో గురువారం ‘సుస్థిరాభివృద్ధి కోసం సాంకేతికత ద్వారా వాణిజ్యం, నిర్వహణను సమన్వయం చేయడం’ అనే అంశంపై జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహించారు.
సదస్సు సంచాలకులు, కళాశాల వాణిజ్య విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రీహరి సదస్సు లక్ష్యాన్ని తెలుపుతూ వాణిజ్యం, నిర్వహణ మరియు సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన తమ పరిశోధన ఫలితాలు, ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులకు జాతీయ సదస్సును నిర్వహించడం ద్వారా మా కళాశాల ఒక వేదికను అందించిందని తెలియజేశారు.
కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం స్వాగతోపన్యాసం ఇస్తూ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని, సుస్థిర అభివృద్ధి కోసం మరిన్ని కళాశాలలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్య అతిథి ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొ ఫెసర్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చెన్నప్ప 94 సంక్షిప్త పరిశోధనా వ్యాసాలతో కూడిన ఐఎస్బీఎన్ నెంబర్ గల వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ కామర్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ ప్రొఫెసర్ రవి కుమార్ జాస్తి, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంజయ్ తది తరులు ప్రసంగించారు. అనంతరం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ షైనీ రాజన్, అనురాగ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనే జ్మెంట్ ప్రొఫెసర్ పి. శ్రీనివాసమూర్తి, ఐఐఎంసి కళాశాల కంప్యూటర్ విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ల పర్యవేక్షణలో మూడు వేర్వేరు వేదికలపై ప్రముఖ వాణిజ్య, నిర్వహణ నిపుణులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యక్షంగా, అంతర్జాలం ద్వారా పాల్గొని సాంకేతికత, సుస్థిరాభివృద్ధిపై వరసగా 31 వాణిజ్య శాస్త్ర, మేనేజ్మెంట్ 38, ఐటీ 07 పరిశోధనా పత్రాలను సమర్పించారు.
అనంతరం ముగింపు సమావేశంలో ప్రతి ఫ్యాకల్టీ నుండి ఒకటి చొప్పున మొత్తం మూడు ఉత్తమ పరిశోధనా పత్రాలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండువేల రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసా పత్రంను కళాశాల ప్రి న్సిపాల్ అందజేశారు. వారిలో వాణిజ్య వి భాగం నుంచి లయోల డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ బంకా కుమార్ రా జా, డా.వికాస్ నాయక్, మేనేజ్మెంట్ విభా గం నుంచి భవన్స్ వివేకానంద కళాశాల విద్యార్థులు నవనీత కె. సాయి దిలీప్, కె. సాయి చరణ్, బి.కారుణ్య, ఐటీ విభాగం నుంచి సెయింట్ మేరీస్ కళాశాల విద్యార్థు లు జైన హాష్మి, సైదా ఉమయ అహ్మద్, పవిత్రాంబిక ఉన్నారు. సదస్సులో కళాశాల డీన్ లు డాక్టర్ తిరుమల రావు, డాక్టర్ సంతో షి, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొని విజయవంతం చేశారు.