ప్రకృతి పుష్పం
ప్రకృతి ఒడిలో పూసిన ఓ మృదుపుష్పమా పొద్దున్న వెలుగుల నవ్వులా మెరిసిపోతావు
తొలకరి చినుకుల తడిలో తేలియాడుతూ భూమి కలలకు పరిమళం అద్దుతావు !
పచ్చని ఆకుల మధ్య దాగిన నీ అందం వసంతపు మొదటి ఊపిరిలా అనిపిస్తుంది !
వేకువజామున మంచుబిందువులు జారితే నీ రేకులపై ముత్యాల హారం మెరగవుతుంది !
తేనెటీగల గీతాల్లో నీ పేరు వినిపిస్తుంది
కోయిల కూయగానే నీ నవ్వు మేరిసిపోతుంది !
గాలికిడిలో ఊగే నీ సోయగం నదితీరపు అలల్ని తలపిస్తుంది !
నీ రంగుల్లో ఇంద్రధనుస్సు మెరుపులుంటాయి !
నీ వాసనలో మట్టివాసన మాధుర్యముంటుంది!
ఎండిన హృదయాలకు చల్లని నీడవై అలసిన మనసులకు ఓదార్చుతావు
చిన్నదైనా నీ జీవితం గొప్ప సందేశం
ముళ్ల మధ్య పుట్టిన ప్రేమనే పంచుతావు
రాలిపోవాల్సిన క్షణం వచ్చినా భూమిమీద అందాల జ్ఞాపకం విడిచిపోతావు !
సూర్యకిరణాల్ని చీరలా కప్పుకొని ఆకాశాన్నే నీ అందంతో మాయచేస్తావు
వానచినుకుల్ని ముద్దాడే వేళలో ప్రకృతి హృదయం నీలో కొట్టుకుంటుంది !
ఓ ప్రకృతి పుష్పమా... నీ పరిమళమే ఈ సృష్టి సంగీతం!
నీ ఉనికే భూమాత గుండెలో శాశ్వత వసంతానికి ప్రతిరూపం
డా.కొరుప్రోలు హరనాథ్






