రైతులకు ఊరట
అక్కలదేవిగూడెం చెరువులోకి 30 శాతం నీరు.. రైతులకు ఊరట
చివ్వెంల,(విజయక్రాంతి): రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలోని చెరువులోకి చేరిన వర్షపు నీటిని ఇరిగేషన్ అధికారులు గురువారం పరిశీలించారు. చెరువులో నీటి నిల్వలు, నీరు చేరిన స్థాయిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు 30 శాతం నీరు చేరినట్లు ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్(Irrigation DE Srinivas) తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన వర్షాల్లో ఇదే పెద్ద వర్షమని ఆయన పేర్కొన్నారు.
వర్షం కారణంగా చెరువు(Lake)లోకి నీరు చేరడంతో రైతులకు కొంత ఊరట లభించిందన్నారు. పశువులకు కూడా నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం మండలంలోని పలు చెరువులను కూడా ఇరిగేషన్ అధికారులు సందర్శించి నీటి నిల్వలు, నీటి ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు. చెరువుల్లోకి చేరిన నీటి పరిమాణంపై అధికారులు అంచనా వేశారు. ఈ పరిశీలనలో ఇరిగేషన్ ఏఈ మమత, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.