ఓపెన్ జిమ్.. యువత ఆరోగ్యానికి బాటలు
- ఆరోగ్యంపై ఆసక్తి పెంచే "ఓపెన్ జిమ్"
- ఓపెన్ జిమ్ తో చెడు వ్యసనాలకు చెక్
- మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి
- ప్రజావాణిలో ఓపెన్ జిమ్ కొరకు దరఖాస్తు
వెంకటాపూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): నేటి ఆధునిక జీవనశైలిలో(Modern lifestyle) యువతలో ఆరోగ్యంపై(Health) శ్రద్ధ తగ్గుతూ, మద్యం, ధూమపానం(Alcohol and smoking) వంటి చెడు వ్యసనాల వైపు ఆకర్షితులవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పలువురు యువకులు ప్రతిరోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్(Morning walking and running) చేస్తూ ఆరోగ్యంపై ఆసక్తి చూపుతున్నారు.
అయితే వ్యాయామం చేసేందుకు ప్రత్యేక సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే యువతను ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు మళ్లించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాకింగ్‌తో పాటు వ్యాయామం..
మండల కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం యువకులు పెద్ద సంఖ్యలో వాకింగ్‌కు వెళ్తుంటారు. ఓపెన్ జిమ్ అందుబాటులో ఉంటే వాకింగ్‌తో పాటు వివిధ రకాల వ్యాయామాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. బహిరంగ ప్రదేశంలో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడం ద్వారా యువత శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.
చెడు వ్యసనాలకు దూరంగా..
ప్రస్తుత కాలంలో కొంతమంది యువత మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. యువతను ఇలాంటి వ్యసనాలకు దూరం చేసి మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. ఇందుకు వ్యాయామం, క్రీడలు ఎంతో దోహదపడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే యువత ఖాళీ సమయాన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు కేటాయించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఆరోగ్యంపై ఆసక్తి పెరిగేలా..
ఓపెన్ జిమ్ అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ వాకింగ్, వ్యాయామం చేయాలనే ఆలోచన యువతలో పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా చేయవచ్చు.
ప్రజావాణిలో దరఖాస్తు
మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో విజయక్రాంతి ప్రతినిధి ఓపెన్ జిమ్ ఏర్పాటుకు అధికారులకు దరఖాస్తును సమర్పించారు. అనువైన స్థలాన్ని గుర్తించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అవసరమైన వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే యువత ఆరోగ్యంగా ఉండటంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు దోహదపడుతుంది.