విద్యుత్ నిలిపివేత.. రైతుకు గుండెకోత ..!
- నీరు లేక నెర్రెలు బారుతున్న వరి పొలాలు
- పంటను కాపాడుకునేందుకు రైతుల ఆరాటం
- సబ్‌స్టేషన్‌ల వద్ద ఆందోళనలు
- కరెంటు సక్రమంగా ఇచ్చి పంటలను కాపాడాలని అన్నదాతల వేడుకోలు
చివ్వెంల, సెప్టెంబర్ 17 : ఓవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో (Unannounced power cuts) రైతులు విలవిలలాడుతున్నారు. పంటలకు నీరందించాల్సిన కీలక సమయంలో విద్యుత్ (Electricity)సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో రైతు సంఘ నాయకులు, రైతులు సబ్ స్టేషన్ లను ముట్టడించి తమ బాధలను తీర్చాలని వేడుకుంటున్నారు. దీనిలో భాగంగా మండలం చందుపట్ల గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ను గురువారం రైతులు ముట్టడించారు.
నెల రోజులుగా విద్యుత్ కోతలు
మండలంలోని పలు గ్రామాల్లో గత నెల రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో పొలాలకు నీరందించలేకపోతున్నామని వాపోయారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, విద్యుత్ కోతలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నాణ్యమైన కరెంటు లేక ఇబ్బందులు
రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా చేసినా సక్రమంగా లేకపోవడంతో ఫ్యాన్లు, టీవీలు, లైట్లు కాలిపోతున్నాయని, ఇక మోటార్ల పరిస్థితి అయితే మరింత అద్వాన్నంగా ఉందని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకునేవారు లేరని, ప్రజాప్రతినిధులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ కోతలను నివారించి, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.
లేఖలు ఇచ్చినా స్పందన కరువు
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా లేఖలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని రైతులు ఆరోపించారు. ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే సబ్స్టేషన్ను ముట్టడించాల్సి వచ్చిందని తెలుపుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*జనరేటర్తో వరి పంటకు నీరు:* విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో చివ్వెంల మండలం వెంకటితండకు చెందిన రైతు గుగులోతు మహేందర్ తన వరి పంటను కాపాడుకునేందుకు జనరేటర్ను ఆశ్రయిస్తున్నాడు. తనకున్న పది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎకరాకు సుమారు రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టాడు. అయితే విద్యుత్ సమస్యలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మిగిలిన నాలుగు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలనే ఆశతో జనరేటర్ సాయంతో పొలానికి నీటిని అందిస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టిన తనకు జనరేటర్ ఇంధన ఖర్చులు అదనపు భారంగా మారాయని వాపోయాడు. సకాలంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపాడు. వరి పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న బాధలను ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు అర్థం చేసుకొని అప్రకటిత కోతలను నివారించాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.
24 గంటల కరెంటు ఇవ్వాలి
నేను పది ఎకరాల వారి పొలం సాగు చేశాను. ఇప్పటికే అందులో ఆ ఎకరాల వ రకు ఎండిపోయింది. మిగిలిన నాలుగు ఎకరాలు కాపాడుకునేందుకు చాలా కష్టపడుతు న్నాను. ఈసారి పెట్టుబడును కూడా బాగా పెట్టాల్సి వచ్చింది. అయితే కరెంటు కోతలు విపరీతంగా ఉండడం వల్ల అది కూడా చేతికి అందుతుందా అని భయం కలుగుతుంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించి ఎండిపోతున్న పంటలను కాపాలి.
జి.మహేందర్, రైతు, చివ్వెంల మండలం