నక్కల జీవితాల్లో వెలుగు!

04-10-2026 | 05:20am
  1. దశాబ్దాల నిరీక్షణకు తెర
  2. ఎస్టీ ధ్రువీకరణ పత్రాల జారీకి శ్రీకారం 
  3. గవర్నర్ చొరవతో కదిలిన యంత్రాంగం
  4. సర్టిఫికెట్‌తో విద్య, ఉపాధి అవకాశాలకు దారి
  5. ముత్యంపేటతో పాటు పలు ప్రాంతాల్లో నక్కల కులస్తుల కుటుంబాలకు ఊరట
  6. సమరసత వేదిక కృషికి ఫలితం

(జనార్దన్ మంద, సిద్దిపేట)  సిద్దిపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నక్కల కులస్తుల(Nakkala community) దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం వారు చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. సామాజిక సమరసత వేదిక(Samarasata Vedika) కృషి, గవర్నర్ చొరవతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది.

సిద్దిపేట జిల్లాలోని ముత్యంపేట, దుబ్బాక, కొండపాక, సిద్దిపేట, భూంపల్లి, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాల్లో నివసిస్తున్న నక్కల కులస్తులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు సర్టిఫికెట్లు లేక  విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలకు దూరమైన నక్కల కులస్తుల జీవితాల్లో ఎట్టకేలకు ఆశాకిరణం లభించింది. వారి కుటుంబాలు, పిల్లల భవిష్యత్తుకు సరికొత్త బాటలు పడనున్నాయి.      

సర్టిఫికెట్ లేక అవకాశాలకు దూరం

సిద్దిపేట జిల్లాలోని ముత్యంపేటతోపాటు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నక్కల కుటుంబాలకు ఏళ్ల తరబడి కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి పథకాలకు దూరమవుతున్నారు. పిల్లల చదువు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంలో అవరోధాలు ఎదురవుతుండేవి. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. వారికి బాసటగా నిలిచిన సమరసత వేదిక ప్రతినిధులు.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. ఇటీవల గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి నక్కల కులస్తుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. స్పందించిన గవర్నర్.. నక్కల కులస్తులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

ఈ మేరకుముత్యంపేట గ్రామాన్ని రెవెన్యూ అధికారులు సందర్శించి వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై అధ్యయనం చేశారు. నక్కల కమ్యూనిటీని అట్టడుగు వర్గంగా గుర్తిస్తూ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. తద్వారా కుల ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గం సుగమమైందని సామాజిక సమరసత వేదిక ప్రతినిధులు తెలిపారు.

సమన్వయ లోపమేనా?

కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో నక్కల కులస్తుల ప్రస్తావన ఉన్నప్పటికీ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురైన ఇబ్బందులకు రెవెన్యూ, గిరిజన సంక్షేమ, జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా కారణమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అరవింద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నక్కల కుటుంబాల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అర్హులైన ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని వారు కోరారు. ముఖ్యంగా వారి పిల్లల చదువు, ఉపాధి అవకాశాలకు, ప్రభుత్వ నుంచి కలిగే ప్రయోజనాలకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోయారు

నక్కల కులస్తులు ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. కులం సర్టిఫికెట్ లేకపోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అధికారుల మధ్య సమన్వయంతో సమస్య పరిష్కారం కావాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ అందాలి. వారి పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలవాలి.

 అప్పాల ప్రసాద్, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్

సంతోషంగా ఉంది

నక్కల కులస్తులకు ధ్రువీకరణ పత్రాల జారీ మొదలవడం సంతోషంగా ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించాలి. విద్య, ఉపాధి రంగాల్లో వారికి అవకాశాలు అందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరేలా చర్యలు తీసుకుంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది.

 డాక్టర్ అరవింద్‌కుమార్, సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు

కల నెరవేరింది

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మా కల ఇప్పుడు నెరవేరింది. సర్టిఫికెట్ లేక మా పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలోని నక్కల కుటుంబాలందరికీ గుర్తింపు కల్పించాలి. విద్య, ఉపాధి, సంక్షేమ అవకాశాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది మా సమాజ భవిష్యత్తుకు కొత్త ప్రారంభం.

 యాదగిరి, నక్కల కులస్తుల రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఎన్నో ఇబ్బందులు పడ్డాం

కుల ధ్రువీకరణ పత్రం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి అందాల్సిన అనేక ప్రయోజనాలను కోల్పోసయాం. పిల్లల చదువులు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. సామాజిక సమరసత వేదిక చొరవతో మా సమస్య అధికారుల దృష్టికి వెళ్లింది. సర్టిఫికెట్లు రావడంతో మా కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి.

కులస్తులు, ముత్యంపేట  


మరిన్ని వార్తలు