రేపే రెడ్‌క్రాస్ ఎన్నికలు

03-10-2026 | 05:35am
  1. రంగంలో ప్రముఖులు-..
  2. మొత్తం ఓటర్లు 16,875 
  3.    15 స్థానాలకు 17 మంది       

కరీంనగర్, అక్టోబర్ 2(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల(Indian Red Cross Society Karimnagar Branch Managing Committee Elections) వేడి ఊపందుకుంది. ఈ నెల 4 న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 16,975 మంది సభ్యులు ఓటు హక్కు(Right to vote) కలిగి ఉన్నారు. కరీంనగర్ రెడ్ క్రాస్ పాలకవర్గ ఎన్నికల బరిలో ప్రముఖ వ్యాపారులు, వివిధ సేవా సంస్థల(Service organization) ప్రతినిధులు ఉండటంతో సాధారణ ఎన్నికలను మరిపించేలా ప్రచారం కొనసాగుతుంది. 

కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలోని మొత్తం 15 మేనేజింగ్ కమిటీ స్థానాల కోసం 17 మంది అభ్యర్థులు గట్టి పోటీ పడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం కరీంనగర్లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  4న మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 జిల్లా శాఖలకు ఒకేసారి అక్టోబర్ 4న ఈ ఎన్నికలు జరుగుతుండటంతో, కరీంనగర్ జిల్లాలో కూడా  సేవా సంస్థ పీఠాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ రసవత్తర వాతావరణాన్ని సృష్టించారు. 

బరిలో ఉంది వీరే...ఏ మునీందర్, సిహెచ్ సురేష్, కోల అన్నారెడ్డి, గోనే శ్రీనివాస్, హనుమాండ్ల రాజిరెడ్డి, కనపర్తి మనోహర్ రావు, కుందారపు మహేశ్వర్, మొగిలోజు రాకేష్, పి శ్రీహరి రెడ్డి, పి విద్యాసాగర్, పెండ్యాల కేశవరెడ్డి, రాగి శ్రీనివాస్, సాయినేని నరేందర్, సంగం లక్ష్మణరావు, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, మదన్మోహన్, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు.

చైర్మన్ ఎన్నిక కీలకం...ఎన్నికయిన 15 మంది సభ్యులనుండి కీలకమైన చైర్మన్, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకొనున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా ఉండే రెడ్ క్రాస్ పాలకవర్గంకు మునుపు ఎన్నడూ లేనివిధంగా పోటీ నెలకొంది. సమాజ సేవ దృక్పథంతో పాటు వివిధ రంగాల అభ్యర్థులు, పంచాయతీ కార్యదర్శులు ఈసారి ఎన్నికల్లో నిలవడంతో, చైర్మన్ పీఠం కోసం హోరాహోరీ పోరు సాగుతోంది.

మరిన్ని వార్తలు