పేదల కన్నీరు తుడవాలి
- నిస్సహాయతతోనే కలెక్టరేట్ గడప తొక్కుతారు
- కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలి
- గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు
- సీఎం రేవంత్‌రెడ్డి
- కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభం
కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయక్రాంతి): సమస్యతో, బాధతో, నిస్సహాయ స్థితిలో కలెక్టరేట్ గడప తొక్కే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉన్నదనే నమ్మకం కలిగించేలా కలెక్టరేట్‌లో అధికారులు పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలని పేర్కొన్నారు.
బుధవారం కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్ట రేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జిల్లాలో చేపడుతున్న మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులకు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు, వరదనీటి మురుగు కాల్వల నిర్మాణ పనులకు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని, కాశ్మీర్ గడ్డ సమీకృత వెజ్,--నాన్ వెజ్ మార్కెట్ ను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిఆర్‌ఎఫ్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌ను సందర్శించారు.
కలెక్టర్ చిత్రా మిశ్రాను కుర్చీలో కూర్చో బెట్టారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా పనిచేయాలని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కా ర్యాలయం సంపూర్ణంగా ఉపయోగపడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అత్యంత నిరుపేద వర్గాల వరకు చేరే విధంగా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని అన్నారు.
ప్రభుత్వ ప్రతినిధులుగా పేదలకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా పాలన ప్రారంభమయ్యే సమయానికి ఉద్యోగులకు జీతభత్యాలు ఒకటో తేదీన ఇవ్వలేని దుస్థితిలో రాష్ర్టం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. జీతభత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదో న్నతులు, బదిలీలు, ఆరోగ్య భద్రత కార్డులు వంటి ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సహకారంతో పరిష్కరిస్తున్నామని అన్నారు.
సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని ఉ ద్యోగులకు సూచించారు. రాష్ర్టంలో పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర మార్గాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు పదిన్నర లక్షల మంది ఉన్నారని, వారు నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందిస్తున్నారని సీఎం తెలిపారు. సుమారు మూడు శాతం మంది ఉద్యో గులు 97 శాతం ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇది ఎంతో నిష్ఠ, శ్రమతో కూడుకున్న బాధ్యత అని అన్నారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశ ప్రధానమంత్రికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అందులో ఉద్యోగుల పనితీరు కీలకమని సీఎం అన్నారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి బాగా పనిచేస్తున్నారని ప్రజలు అంటారని, ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేకపోతే ప్రభుత్వాల వల్ల లాభం లేదని ప్రజలు అంటారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 840 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగర అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు.
అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అభినందించేందుకు తనకు ఎలాంటి సంకోచాలు లేవని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి అవసరమైన పనులు సాధించుకోవాలని చూస్తామని సీఎం తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ 98 శాతం పూర్తయిందని, సుప్రీంకోర్టులో కేసు కారణంగా మిగిలిన పనులు పెం డింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఇటీవల సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలను కొంతమంది అపహాస్యం చేస్తూ 78 సార్లు ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నారని, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్లాల్సిందేనని అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం మారం జగదీష్ ఎన్నోసార్లు నాయకుల చుట్టూ తిరుగుతున్నారని, రెండు రోజులు ఆలస్యం అయితే సామాజిక మాధ్యమాల్లో ఆయనను విమర్శిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలకు రావాలంటే కంటోన్మెంట్ ప్రాంతం బాటిల్ నెక్‌గా ఉందని సీఎం తెలిపారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు, అప్పటి ప్రధాని వాజ్పేయి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు.
2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలల కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో 170 ఎకరాల డిఫెన్స్ భూమిని రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. బేగంపేట ఎయిర్పోర్టు వద్ద రన్వే కారణంగా రహదారి నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న ప్రాంతంలో టన్నెల్ రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఒక సంవత్సరం కాలంలో ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తాయని, వీటిని రూ.5 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని సీఎం తెలిపారు.
రాష్ట్రానికి అవసరమైన పనులకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం మన బాధ్యత అని అన్నారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay)కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా.. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌష్ అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే శ్రీనివాస్ రెడ్డి డిఆర్‌ఓ స్వామి తదితరులు పాల్గొన్నారు.