6 September, 2026 | 10:52 AM

దద్దమ్మ ప్రభుత్వంలో ఆర్టీసీకి అరిగోస

06-09-2026 | 05:20am
  1. మండలిలో ఈ సమస్యను లేవనెత్తుతా
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ ఇందిరాపార్కు(Indira Park, Hyderabad) వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikari Party) అనుబంధ ఆర్టీసీ యూనియన్(RTC Union) అయిన బహుజన వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు టీవీఆర్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల(Retired RTC Employees)కు చెల్లించాల్సిన గ్రాట్యుటీ(Gratuity), పీఎఫ్(PF), లీవ్ ఎన్క్యాష్మెంట్(Leave Encashment), కమ్యూటేషన్(Commutation) తదితర పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నాలో నిర్వహించారు.

టీఆర్పీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) హాజరై మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాల్సిన వయసులో తమకు రావాల్సిన హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కాదు, వీరు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ‘అవిశ్రాంత ఉద్యోగులు‘ అని అభివర్ణించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం కేవలం రూ.860 కోట్లేనని, ప్రభుత్వం సంకల్పం చేస్తే ఒక్క రోజులోనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనమండలి సమావేశాల్లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తానని, వారికి రావాల్సిన ప్రతి రూపాయి చెల్లించే వరకు శాసనసభలోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ పోరాటం కొనసాగిస్తానని మల్లన్న ప్రకటించారు. కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్  చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్, ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అంజాద్ ఉల్లా ఖాన్, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు