ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలకు జీవం

02-10-2026 | 04:46pm
  1. గ్రామ పరిశుభ్రతే లక్ష్యం: సర్పంచ్ రవికుమార్ పాటిల్
  2. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని పిలుపు

నాగల్‌గిద్ద, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ రవికుమార్ పాటిల్(Nagalgidda Sarpanch Ravikumar Patil) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. తదుపరి బీవీజీ రామ్‌జీ కార్యక్రమంపై సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, భూగర్భ జలాల పెంపుపై గ్రామస్థులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ పాటిల్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అపరిశుభ్ర పరిస్థితులు కనిపిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులను కోరారు.భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామంలో రెండు పెద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నుంచి వచ్చే వృథా నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛత, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి కుటుంబం సహకరించాలని సర్పంచ్ రవికుమార్ పాటిల్ కోరారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ విశ్వనాథ్, వార్డు సభ్యులు సచిన్ ముర్గే, గోవింద్ మడివాల్, వామన్‌రావు పాటిల్, మాజీ ఉపసర్పంచ్ పండరి, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు