మనవడి బర్త్‌డే.. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వే

08-10-2026 | 10:49am

పెద్దపల్లి జిల్లా | సుల్తానాబాద్, అక్టోబర్ 08 (విజయ క్రాంతి): హంగులు, ఆర్భాటాలకు పోకుండా పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదలకైనా సహాయం అందించాలనే గొప్ప లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ప్రముఖ రైస్ మిల్లుల వ్యాపారవేత్త, సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి-సత్తెమ్మ దంపతుల మనవడు శ్రీ శశాంక్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఉన్న పేదలకు బట్టలు అందజేశారు.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ముందుగానే అక్కడ ఉంటున్న వృద్ధులకు ప్యాంట్, షర్ట్ కుట్టించేందుకు కొలతలు తీసుకొని, వాటిని అందించడం చాలా గొప్పతనం. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని పురుషులు, మహిళలు శ్రీ శశాంక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రామ్మూర్తి-సత్తెమ్మ దంపతులతో పాటు వారి కుమారుడు, కోడలు రాజేష్-ప్రియాంక దంపతులకు, వారి కుమారులు శశాంక్, శ్రేయాంక్‌లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా కొమురవెల్లి రామ్మూర్తి-సత్తెమ్మ దంపతులు మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించుకోవడం కంటే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్-లక్ష్మి, వృద్ధాశ్రమం కో-ఆర్డినేటర్ గట్టు స్వామి, నరేష్, క్యాడర్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు