రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదెప్పుడో..?
రెండు గంటల పాటు స్తంభించిన వాహన రాకపోకలు
శేషగిరి నగర్ వాసుల మెరుపు ధర్నా
చుంచుపల్లి, (విజయక్రాంతి): మూడేళ్లుగా రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నామని, నూతన రోడ్డు నిర్మిస్తామని తవ్వి పాత రోడ్డుని పాడుచేసి వదిలేసారని శేషగిరి నగర్ వాసులు(Sesha Giri Nagar Residents) బైపాస్ రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు. తవ్విన రోడ్డు పైన భారీ వాహనాలు తిరగడం బొగ్గు లారీలు తిరగడం వలన తీవ్రమైన దుమ్ము వస్తుందని, తద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తమ ప్రాంతవాసులకు వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే శేషగిరి నగర్ ప్రాంతవాసులు చాలామంది ఆసుపత్రి పాలయ్యారని, ఈ దుమ్ము అరికట్టకపోతే,రోడ్డు వేయకపోతే శేషగిరి నగర్ లో నివాసం ఉండలేకపోతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన చెందారు . సమస్య పరిష్కారం కాకపోతే ప్రతిరోజు ధర్నా చేస్తామని వాహనాలు ఈ రోడ్డు గుండ రానియ్యమని స్థానిక ప్రజలు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శేషగిరి నగర్ వద్ద బైపాస్ రోడ్డులో స్థానిక ప్రజలు రోడ్డుకి అడ్డంగా కూర్చుని రాస్తారోకో నిర్వహించారు, దీంతో అటుగా వెళుతున్న వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకొని కాలనీవాసులతో సంఘీభావం తెలుపుతూ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని టిఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి డి వీరన్న మరియు జిల్లా నాయకత్వం పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం సమాచారం అందుకున్న 1 టౌన్ సీఐ కరుణాకర్ శేషగిరి నగరికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింప చేశారు. రాస్తారోకో చేసిన వారిలో 8వ వార్డ్ మెంబర్ ధర్మఘత్ శివలక్ష్మి, నాగమణి, దేవి, లలిత, మల్లికాంబ,కిషన్,రవీందర్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు."