టీసీఎస్ డేటా సెంటర్ ఏర్పాటు నా కల!
- ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది
- 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో కీలక అడుగు
- టీసీఎస్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం
- టీసీఎస్ హైపర్ వాల్ట్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి
- హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
- రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని టీసీఎస్(Tata Consultancy Services Limited) తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అభిప్రాయపడ్డారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్(Telangana Rising Vision)-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ(economy) లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టును కీలక అడుగుగా అభివర్ణించారు.
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్(AI data center campus)ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్(Tata Consultancy Services Limited) అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్(Hypervolt) ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu), మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
టీసీఎస్ సీఈఓ కే.కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వీ.రాజన్న, సీఈఓ, ఎండీ దీపేష్ నందా హాజరయ్యారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కే. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బీ. అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కే. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.
రూ. 70వేల కోట్లతో 250 ఎకరాల విస్తీర్ణంలో..
హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.
దేశానికే తలమానికంగా..
తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్ ప్రతినిధులను అభినందించారు.
ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతోపాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్- డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా తెలంగాణ ఈ ప్రాజెక్టును సాధించింది. ఈ ప్రా జెక్టుతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత చేరువైంది.






