సీఎం తొలి అడుగే అద్భుతం
- సిరిసిల్లకు కొత్త ఊపు
- రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి బాటలు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వేసిన తొలి అడుగే జిల్లా అభివృద్ధికి అద్భుత ఆరంభమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) అన్నారు. సిరిసిల్లలో మొదలైన ఈ ప్రస్తానంలో భాగంగా సీఎం రెండో అడుగు సిద్దిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడుతుందన్నారు.
బుధవారం సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో రూ.1000 కోట్లతో అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. గత పాలకులు పడావు పెట్టిన మలక్పేట రిజర్వా యర్ కాలువ భూసేకరణ పనులకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. వేములవాడ ఆలయానికి గత పాలకులు సంవత్సరానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.250 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం నేతన్నలకు చెల్లించాల్సిన రూ.375 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, 6 కోట్ల 90 లక్షల మీటర్ల చీర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చి చేతినిండా పని కల్పించామని పేర్కొన్నారు. ముంపు గ్రామాల బాధితులకు పెండింగ్ ఉన్న 35 కోట్ల రూపాయలను ముఖ్యమం త్రి విడుదల చేశారని వెల్లడించారు. 4,600 కుటుంబాలకు పైగా రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరయ్యాయని, మరో 6 వేల కుటుంబాలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని వెల్లడించారు. సిరిసిల్ల నియోజక వర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మం జూరు చేయడంతో పాటు కాళేశ్వరం ప్యాకేజీలు 9,10, 11, 12 పరిధిలో కాలువల నిర్మా ణానికి భూసేకరణ నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.