ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి
నిర్మల్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. అహింసా మార్గాన్ని అనుసరిస్తూ గాంధీజీ దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజల్లో ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.
గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.