ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం
హనుమకొండ,(విజయక్రాంతి): జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Julywada Government High School)లో స్టూడెంట్ కౌన్సిల్ (విద్యార్థి నాయకుల) ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడారి భాస్కర్ రెడ్డి స్టూడెంట్ కౌన్సిల్ కు ఎన్నికైన విద్యార్థినీ, విద్యార్థులకు బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక బ్యాడ్జీలు, స్కార్ఫ్‌లను అందించారు.
పాఠశాల హెడ్ బాయ్ గా ఎస్. మనోజ్ కుమార్ , హెడ్ గర్ల్ గా జి. సనా, స్పోర్ట్స్ కెప్టెన్ గా కే. సోమేశ్వర్, డిప్యూటీ హెడ్ బాయ్ గా డి. పూర్ణచందర్, డిప్యూటీ హెడ్ గర్ల్ గా పి.వైష్ణవి, స్పోర్ట్స్ వైస్ కెప్టెన్ గా ఎస్. ప్రభాస్ లతో హెచ్ఎం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతన విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పాఠశాల నిబంధనలకు కట్టుబడి ఉంటామని, క్రమశిక్షణతో పాటు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించడానికే స్టూడెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. చదువుతో పాటు నాయకత్వ నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు నూతన నాయకులను అభినందిస్తూ, వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రోటెమ్ స్పీకర్ గా జంగిలి వెంకటేశ్వర్రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.