అక్రమ టేకు కలపపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

23-09-2026 | 10:18pm

అంకంపాలెం బీట్‌లో రూ.7.05 లక్షల విలువైన 5.235 క్యూబిక్‌ మీటర్ల టేకు కలప స్వాధీనం

దమ్మపేట, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): విలువైన టేకు చెట్లను అనుమతులు లేకుండా నరికివేయడం, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కలపను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి అక్రమాలకు అటవీ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు(District Task Force officials) స్పష్టం చేశారు. అటవీ సంపద పరిరక్షణలో భాగంగా జిల్లాలో అక్రమ కలప నరికివేత, నిల్వ, రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద రక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ కీలకంగా పనిచేస్తోందని ఏ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కేంద్రం 24×7 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందితో నిరంతరం పనిచేస్తోందని, అంకంపాలెం బీట్‌లో అనుమతులు లేకుండా టేకు కలపను అక్రమంగా నిల్వ చేసినట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ బృందానికి వెంటనే సమాచారం చేరవేశారు.

సమాచారం అందిన వెంటనే టాస్క్‌ఫోర్స్‌ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దమ్మపేట రేంజ్ అధికారి,‌ బీట్‌, సెక్షన్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందిన 24 గంటల్లోనే టాస్క్‌ఫోర్స్‌ బృందం అక్రమ కలప నిల్వను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అటవీ నేరాల నియంత్రణలో వేగవంతమైన సమాచార వ్యవస్థ, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయానికి నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. 

అధికారులు నిర్వహించిన కొలతల్లో 57 టేకు రౌండ్‌ దుంగలు – 2.775 క్యూబిక్‌ మీటర్లు, 44 టేకు సాన్‌ సైజులు – 2.460 క్యూబిక్‌ మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తంగా 5.235 క్యూబిక్‌ మీటర్ల టేకు కలప, సుమారు రూ.7.05 లక్షల విలువైన అటవీ సంపదను స్వాధీనం చేసుకున్నారు.

కలపను నిల్వ ఉంచిన వ్యక్తిని అధికారులు విచారించగా, తాను ఈ టేకు కలపను ఒక రైతు వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే సంబంధిత చెట్లను నరికివేయడానికి అవసరమైన అనుమతులు, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా నరికిన చెట్ల నుంచి వచ్చిన కలపను కొనుగోలు చేసినా, నిల్వ ఉంచినా అది చట్టబద్ధమైన కలపగా మారదని అధికారులు స్పష్టం చేశారు.

అటవీ శాఖ అనుమతులు, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం లేదా రవాణా చేయడం వర్తించే అటవీ చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలకు దారితీస్తుందని తెలిపారు. కలప కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ దాని మూలం, అనుమతులు, రవాణా పత్రాలు, చట్టబద్ధతను తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.

స్వాధీనం చేసుకున్న మొత్తం టేకు కలపను దమ్మపేట ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి సమక్షంలో అంకంపాలెం బీట్‌ అధికారి ఏ. పార్వతి సురక్షిత కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు