27 August, 2026 | 1:38 AM

బీసీసీఐ సభ్యత్వం కోసం టీసీఏ ప్రయత్నం

27-08-2026 12:36 AM

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) న్యాయబద్ధమైన అవకాశాల కోసం తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 18 జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ సభ్యత్వం కోసం ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న అభ్యర్థనను చర్చకు తీసుకురావాలని బీసీసీఐని టీసీఏ కోరుతోంది.

అండమాన్ & నికోబార్ దీవులు వంటి కొత్త క్రికెట్ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకునే ప్రయత్నాల నేపథ్యంలో టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ద్వంద్వ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. కొత్త క్రికెట్ ప్రాంతాలకు అవకాశాల మార్గం కల్పించాల్సి ఉంటే, తెలంగాణకు కూడా అదే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ వెలుపల ఉన్న తెలంగాణ జిల్లాలను క్రికెట్ పరిపాలనా వ్యవస్థలోని ఒంటరితనం నుంచి బయటకు తీసుకురావడానికి టీసీఏ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతోంది. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు వరకు సాగిన ఐదేళ్ల న్యాయపోరాటం అంతులేని చర్చలతో ముగియకూడదని టీసీఏస్పష్టం చేసింది. గుజరాత్లో బరోడా, గుజరాత్, సౌరాష్ట్ర, మహారాష్ట్రలో మహారాష్ట్ర, ముంబై, విదర్భ వంటి పలు క్రికెట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడు, తెలంగాణ జిల్లాలను మాత్రమే ప్రధాన దేశీయ క్రికెట్ నుంచి ఎందుకు దూరంగా ఉంచుతున్నారని టీసీఏ ప్రశ్నించింది.