5 September, 2026 | 7:41 PM

ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు

05-09-2026 | 05:47pm

* ఉన్నత లక్ష్యంగా విద్యను అభ్యసించాలి..

* చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

* ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా ఎస్పీ

ఉట్నూర్‌, సెప్టెంబర్‌ 05 (విజయక్రాంతి): విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించడంతోపాటు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌(SP Akhil Mahajan) అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఇంద్రవెల్లి(Indravelli) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 50 మంది ఉపాధ్యాయులను పోలీస్‌ శాఖ తరఫున సన్మానించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు రాబోయే కాలంలో ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా ఇప్పటినుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకుని విద్యను అభ్యసించాలని సూచించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర ఉన్నత పదవులు సాధించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

విద్యార్థులు ఎక్కువ సమయం తల్లిదండ్రులతో కాకుండా ఉపాధ్యాయులతో గడుపుతారని, ఈ సమయంలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు వారు చూపించే మార్గంలో పయనించాలని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న 1,069 మంది విద్యార్థులు అభ్యసించే ఈ పాఠశాల నుంచి డాక్టర్లు, న్యాయవాదులు, పోలీస్‌ శాఖలో ఉన్నత ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగాలు సాధించే విధంగా విద్యను అభ్యసించాలని సూచించారు.

ఇప్పటినుంచే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు చూపించే మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. పాఠశాలల పక్కన గుట్కా తదితర వాటిని విక్రయించకుండా చూసుకుంటామని తెలిపారు. గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో 272 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, అందులో ఎనిమిది మందికి ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఆయనతోపాటు ఉట్నూర్‌ ఏఎస్పీ రిత్విక్‌ సాయి కుట్టే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి, సీఐ మాడవి ప్రసాద్‌, ఎస్సై సాయన్న, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



మరిన్ని వార్తలు