ప్రజా ఉద్యమ బాట.. విమలక్క పాట

03-10-2026 | 05:00am

పాట... కేవలం వినోదం కాదు. ప్రజల కన్నీటికి గొంతుక. బాధలకు బాసట. ప్రశ్నలకు ప్రతిధ్వని. ఉద్యమాలకు ఊపిరి. తెలంగాణ(Telangana) నేలపై ఎన్నో ప్రజా ఉద్యమాలకు పాట వెన్నెముకైంది. ఆ పాటను ఆయుధంగా మలుచుకుని ఐదు దశాబ్దాలుగా ప్రజల కోసం ప్రజల మధ్య గళమెత్తుతున్నారు విమలక్క(Vimalakka). పురుషాధిక్య సాంస్కృతిక రంగంలో(Cultural Sphere) ఒక మహిళగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. అణగారిన వర్గాల బాధలను, మహిళల సమస్యలను, సామాజిక అసమానతలను, రైతులు(Farmer), కూలీల కష్టాలను తన పాటల్లో పలికిస్తూ ముందుకు సాగుతున్నారు. విమలక్కకు తెలంగాణ ప్రజా సాంస్కృతి కోద్యమంలో ప్రత్యేక స్థానముంది. ఆలేరు ఆడపడుచుగా పుట్టి తెలంగాణ ఉద్యమ గళంగా ఎదిగిన ఆమె ప్రస్థానం నేటితరానికి స్ఫూర్తిదాయకం. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన విమలక్క 1964లో జన్మించారు. ము గ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములతో కూడి న కుటుంబంలో పెరిగారు. తల్లి నర్సమ్మ కష్టజీవి. తండ్రి బండ్రు నర్సింహులు రైతుకూలీ సంఘం నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడేవారు. ఇంటి వాతావరణమే విమలక్క కు ప్రజా సమస్యలపై అవగాహనకు తొలి పాఠశాలగా మారింది. ఆలేరులో పదో తరగతి వరకు చదివిన ఆమె..  భువనగిరిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ వచ్చిన విమలక్క.. క్రమంగా పాటను ఉద్యమ సాధనంగా మలుచుకున్నారు. జీవన సహచరుడు అమర్‌తో కలిసి సామాజిక, సాంస్కృతిక ప్రయాణాన్ని సాగించారు.

పాటకు ఉద్యమ పంథా

అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంతో అనుబంధం విమలక్క కళా ప్రస్థానానికి మరింత బలాన్నిచ్చింది. తన బృందంతో కలిసి గ్రామాలు, పట్టణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక సందేశాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. మహిళల సమస్యలు, జోగిని వ్యవస్థ, సామాజిక వివక్ష, మానవ హక్కులు వంటి అంశాలు విమలక్క గళంలో ప్రశ్నలుగా మారాయి.  

తెలంగాణ ఉద్యమానికి ఊతం

తెలంగాణ  ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో విమలక్క పాట మరింత ఊపిరిపోసింది. ధూంధాం వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లారు. సాగునీటి సమస్యలు, రైతుల కష్టాలు, కూలీల జీవనం, వలసలు, గ్రామీణ ప్రజల సమస్యలు, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలను పాటల ద్వారా ప్రజల ముందుంచారు. సభలు, ర్యాలీలు, ఉద్యమ కార్యక్రమాల్లో విమలక్క గానం స్ఫూర్తిని రగిలించింది.  

సమాజాన్ని ప్రశ్నిస్తూ..

ప్రజా కళారంగంలో ఒక మహిళ కొనసాగడం అంత సులభం కాదు. కుటుంబ బాధ్యతలు, సామాజిక ఆంక్షలు, వివక్ష, వివిధ ఒత్తిళ్లు ఎదురైనా విమలక్క తన గళాన్ని ఆపలేదు. సమస్య ఉన్న చోట పాట వినిపించారు. ప్రజల మధ్యకు వెళ్లారు. బాధితుల గొంతుకగా నిలిచారు. మహిళలు, దళితులు, కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన స్వ రాన్ని వినిపించారు. ఆమె పాటల్లో ఒకవైపు ఉద్యమ నినాదం వినిపిస్తే.. మరోవైపు పల్లె ప్రజల జీవన వేదన కనిపిస్తుంది. అందుకే ఆమె పాటలకు ఉద్యమ వేదికలతో పాటు గ్రామీణ ప్రజల్లోనూ ప్రత్యేక ఆదరణ ఉంది. 

ఐదు దశాబ్దాల గళం

సామాజిక మార్పు కోసం పాటను సాధనంగా మలుచుకున్న విమలక్క ప్రస్థానం తెలంగాణ సాంస్కృతిక ఉద్యమచరిత్రలో ఒక ప్రత్యేక అధ్యా యం. ఒక తరం నుంచి మరో తరానికి ఉద్యమస్ఫూర్తిని పాటతో అంది స్తూ సాగిన ఆమె కళా ప్రయాణం నేటితరానికి ఆదర్శం. ఆమె పాటల ప్ర స్థానం ఐదు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ప్రజాకళల జాతర’ ఆమె సుదీర్ఘ సాంస్కృతిక సేవలను మరోసారి గుర్తుచేస్తు న్నది. ఇది ఒక కళాకారిణి ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడమే కాదు.. ప్రజా ఉద్యమాల్లో పాట పోషించిన పాత్రను స్మరించుకునే సందర్భం కూడా!

  సందెన శంకర్, ఆలేరు

మరిన్ని వార్తలు