అస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ
- సాయుధ పోరాటం నుండి రైతాంగ పోరాటం వరకు మరువలేని చరిత్ర..-
- సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్/జగిత్యాల/సిరిసిల్ల/పెద్దపల్లి, సెప్టెంబరు 17 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రం (Telangana State)అంటే ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని అస్తిత్వ పోరాటానికి ప్రత్యేకగా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ (State Social Welfare Department) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈసందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ 17 సెప్టెంబర్ 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది, అఖండ భారత్ లో విలీనమైందని గుర్తు చేశారు. ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబరు 17వ తేదీని తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని ఇది ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అన్నారు.
తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసిన ఆనాటి వీరయోధులకు జోహార్లు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంట్ర్పజెస్ శాఖ మంత్రి అజాహారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజని అన్నారు.
ఈ చారిత్రక ఘట్టానికి 78 సంవత్సరాలు పూర్తు, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటు న్నామని తెలిపారు. నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయ కమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అ నంతరం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడి సెప్టెంబర్ 1 నాటికి 1000 రోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కెవై ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.-
సిరిసిల్ల జిల్లాలో..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని తెలిపారు.1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్య్ర భారతావనిలో 60ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని పేర్కొన్నారు.
అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయ శ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.-
పెద్దపల్లి జిల్లాలో...
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పెద్దపల్లి ఐడీఓసీ కార్యా లయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ బలోపేతం, యువతకు ఉద్యోగాలునైపుణ్య శిక్షణ, విద్యావైద్య రంగాల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీరాము లు, డీసీపీ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్డీఓ గంగయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, ఏసిపి జి. కృష్ణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.