తెలంగాణలో భూ సంస్కరణలు

06-10-2026 | 05:10am

టీ. చిరంజీవులు : 

తెలంగాణ చరిత్రను(History of Telangana) అర్థం చేసుకోవాలంటే భూమి చరిత్రను(History of the Earth) అర్థం చేసుకోవాలి. తెలంగాణలో జరిగిన ప్రతి పెద్ద సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామం ఏదో ఒక రూపంలో భూమితో ముడిపడి ఉంది. నిజాం పాలనలోని(Nizam's Rule) జాగీర్దారీ, ఇనాం, సర్ఫ్--ఎ-ఖాస్ వ్యవస్థల నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పో రాటం (Telangana Armed Peasant Struggle)వరకు, జాగీర్ రద్దు నుంచి టెనెన్సీ సంస్కరణల వరకు, భూ పరిమితి చట్టం(Land Ceiling Act) నుంచి ప్రభుత్వ భూముల పంపిణీ వరకు,  కోనేరు రంగారావు కమిటీ నుంచి ధరణి, భూ భారతి వరకు.. తెలంగాణ భూ చరిత్ర అనేది కేవలం రెవెన్యూ చట్టాల చరిత్ర కాదు.

అది భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నుం చి విముక్తి, ఆస్తి హక్కు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాట చరిత్ర. ఇటీవల తెలంగాణ శాసనసభలో ‘22-ఏ’ నిషేధిత భూములపై జరి గిన విస్తృత చర్చ ఈ పాత ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది. తెలంగాణలో భూమి ఎవరిది? దానిపై చట్టబద్ధమైన హ క్కు ఎవరిది? వాస్తవంగా దాన్ని అనుభవిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే 1948కు మాత్రమే కాదు, నిజాం కాలానికి వెనక్కి వెళ్లాలి.

భూమి, రైతు, వెట్టి నుంచి భూ సంస్కరణల వరకు : తెలంగాణలో ప్రపం చంలోనే అత్యంత క్రూరమైన భూస్వామ్య వ్యవస్థ (ఫ్యూడల్) అమలులో ఉండేది. ఈ రోజు మనం తెలంగాణ భూమి చరిత్రను గుర్తు చేసుకుంటున్నప్పుడు, చెరబండ రాజు రచించిన మా భూమి సినిమాలోని ఒక పాట మన కళ్లముందు కదలాడుతుం ది. ‘ఏటికేతం బెట్టి, ఎయిపుట్లు పండించి, గంజిలో మెతుకెరగనన్నా.. నేను గంజిలో మెతుకెరుగరన్న.’ ఇది కేవలం పాట కాదు.. ఇది ఒక రైతు కన్నీటి చరిత్ర, ఇది భూమిని దున్నినవాడికి భూమిపై హక్కు లేకపోయిన కాలం యొక్క చరిత్ర, వెయ్యి పుట్లు పండించిన తినడానికి గంజిలో కూడా మెతుకు లేని  పరిస్థితి, పండించిన పంట మధ్యవర్తులు శిస్తుల రూపంలో దోచిన పరిస్థితిని తెలిపే ఒక పాట. 

1948 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో భూమి ఎంత?

హైదరాబాద్ సంస్థానం భౌగోళికంగా సుమారు 82,698 చదరపు మైళ్లు, అంటే 5.29 కోట్ల ఎకరాలు. ఇందులో మరాఠ్వా డా, కళ్యాణ్ కర్ణాటక కూడా కలిసి ఉన్నాయి. ఒక తెలంగాణ విస్తీరణమే చూ సుకుంటే  2.33 కోట్ల ఎకరాలు. తెలంగాణలో స్థూలంగా సాగు చేయగల  విస్తీర్ణం 1.66 కోట్ల ఎకరాలు. 

సర్ఫ్--ఎ--ఖాస్ భూములు : నిజాం వ్యక్తిగత/క్రౌన్ ఎస్టేట్ -52 లక్షల ఎకరాలు. (9.9%)

జాగీర్ /పైగా/సంస్థానాలు : వివిధ సామంతులకు, సేవాధారిత కుటుంబాలకు సంబంధించిన భూవ్యవస్థలు 1.68 కోట్ల ఎకరాలు (30.9%)

దివాని/ఖాల్సా :  ప్రభుత్వ ప్రత్యక్ష రెవెన్యూ పరిపాలనలో ఉన్న ప్రాంతం(రైతులు నేరుగా సాగు చేసుకునే భూములు) 2.17 కోట్లు ఎకరాలు (41.03%)

శిస్తు నిర్ణయించిన వృథా భూమి (అస్సెస్డ్ వేస్ట్): 18.78 లక్షల ఎకరాలు (3.55%)

అంచనావేయబడని బీడు భూమి/పొరంబోకు: 63.28 లక్షల ఎకరాలు (11.96%)   

ఇనాం/మక్తా భూములు :  8.70 లక్షల ఎకరాలు (1.64%)    

మొత్తం : 5.29 కోట్ల ఎకరాలు (100%) అంటే భూమి మొత్తం ఒకే రకమైన యాజమాన్య వ్యవస్థలో లేదు. భూ మిపై హక్కు, రెవెన్యూ వసూలు హక్కు, సాగు హక్కు, గ్రామాధికారం.. ఇవి వేర్వేరు స్థాయిల్లో ఉండేవి. 

అసలు సమస్య భూమి యాజమాన్యం మాత్రమే కాదు : గ్రామంలో ఒక రైతు భూమిని సాగు చేస్తున్నా దానిపై సం పూర్ణ హక్కు ఉండకపోవడం, కౌలు చెల్లించడం, భూమి నుంచి ఎప్పుడైనా తొల గించే ప్రమాదం ఉండడం, గ్రామాధికారుల ద్వారా వివిధ రకాల వసూళ్లు ఉండ డం, అప్పుల బారిన పడితే భూమి కోల్పో యే పరిస్థితి, సామాజికంగా దిగువ స్థా నంలో ఉన్న కులాలకు వెట్టి వంటి ఉచిత శ్రమ బాధ్యతలు ఉండేవి. అందువల్ల సాగు చేసేవాడు రైతు, కానీ నిర్ణయం తీసుకునేవాడు భూస్వామి అనే సంబంధం అనేక ప్రాంతాల్లో ఏర్పడింది.

దొర, దేశ్‌ముఖ్, జాగీర్దార్ వ్యవస్థ- : తెలంగాణలో గ్రామీణ అధికార నిర్మాణంలో దేశ్‌ముఖ్ , దేశ్పాండే, జాగీర్దార్, జ మీందారీ (పెద్ద భూస్వామి )పటేల్, పట్వా రీ, వంటి మధ్యవర్తి శక్తులు ముఖ్యమైనవి. కొన్ని ప్రాంతాల్లో ఒకే కుటుంబం భూమి, రెవెన్యూ వసూలు, గ్రామ పరిపాలన, అప్పు, పోలీసు/అధికార సంబంధాలు అన్నింటినీ ప్రభావితం చేయగలిగేది. పెద్ద భూస్వాముల వద్ద వేల నుంచి లక్ష ఎకరాల వరకు భూమి కేంద్రీకృతమై ఉన్న ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. సూ ర్యాపేట జమీందార్ జెన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి కి 2 లక్షల ఎకరాల భూమి, అలాగే విశునూర్ రామచంద్రారెడ్డికి  సుమారు 40 వేల ఎకరాల భూమి ఉండేదని రికార్డులు చెబుతున్నాయి.    

వెట్టిచాకిరీ అంటే ? : వెట్టి అంటే కూలి / జీతం లేకుండా బలవంతంగా చేయించుకునే పని-. ఇది కేవలం ఉచితంగా ఒకరోజు పని చేయడం కాదు.. కొన్ని ప్రాంతాల్లో అది ఒక కుల- సామాజిక బాధ్యతగా మా రింది. ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు గ్రామంలోని ఆధిపత్య కుటుంబాలకు ఇంటి పనులు, వ్యవ సాయ పనులు, పశువుల సంరక్షణ, బం డ్లు/రవాణా, వివిధ సేవలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 1927లోనే వెట్టిని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అది అసలు అమలు కానీ పరిస్థితి. అందుకే తెలంగాణ రైతాంగ పోరాటాన్ని కేవలం భూమి కో సం పోరాటంగా చూడటం అసంపూర్ణం. అది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో  భూ మి + భుక్తి + వెట్టి నిర్మూలన + గౌరవం + స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం.

తెలంగాణ రైతాంగ పోరాటం ఎందు కు పుట్టింది? : 1940 దశకంలో పరిస్థితులు తీవ్రమయ్యాయి. రైతు ఎదుర్కొన్న సమస్యలను మూడు పదాల్లో చెప్పవచ్చు.. భూమి  భుక్తి, విముక్తి. అంటే భూమిపై హక్కు, పంటపై హక్కు, బలవంతపు శ్రమనుంచి విముక్తి, అధిక కౌలు, అక్రమ వసూళ్ల నుంచి విముక్తి, భూస్వామి నిరంకుశత్వం నుంచి విముక్తి కోసం సాగిన ఉద్యమము. ప్రపంచ చరిత్రలోనే ఒక మ హోజ్వల విప్లవ పోరాట ఘట్టం. 1946-51 తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం సుమారు 3,000 గ్రామాలకు విస్తరించింది.

సుమారు 4 వేల మంది అమరుల య్యారు. నిజాం రజాకార్లు, మరియు జెన్ వెల్లోడి మిలిటరీ రూలర్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని మారణకాండ కొనసాగింది. అయినా ప్రజలు వె నుకడుగు వేయలేదు. చివరకు 1951లో విరమింపబడింది ఉద్యమ ప్రభావిత ప్రాం తాల్లో వెట్టి, అక్రమ వసూళ్లు ఆగిపోయా యి. ఉద్యమ ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల భూమి.. పేదలు, భూమి లే నివారికి పంచబడినట్లు చెప్పబడుతుంది. అయితే ఇది అధికారిక నివేదిక కాదు.

1948 తర్వాత జాగీర్దారీ వ్యవస్థ 

నిర్మూలన : హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత అ త్యంత ముఖ్యమైన చర్యల్లో ఒకటి జాగీర్దారీ నిర్మూలన చట్టం1949 (హైదరాబాద్ (అబోలిషన్ ఆఫ జాగీర్స్) రెగ్యూలేషన్ 1949 ). దీని ప్రకారం 15 ఆగస్టు 1949 నుంచి జాగీర్ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. జాగీర్దార్లకు భూమిపై పాత రాజకీయ/రెవెన్యూ హక్కు స్థానంలో పరిహారం/నిర్వహణ హక్కులు ఏర్పడ్డాయి. 

సుమారు 995 మంది జాగీర్దా రులు తొలగించబడ్డారు. పరిహారంగా సు మారు రూ.18 కోట్లు నిర్ణయించబడింది. సాగుదారులకు భూములపై హక్కులు కల్పించే పట్టాల ప్రక్రియ ప్రారంభమైంది.  ఇది ఒక గొప్పనిర్మాణాత్మకమై న మార్పు. అంటే, సాగుదారుడికి హక్కు అనే మా ర్పునకు పునాది పడింది.

నిజాం సర్ఫ్--ఎ--ఖాస్ భూములకు ఏమైంది? : సర్ఫ్--ఎ--ఖాస్ భూములు నిజాం వ్యక్తిగత ఎస్టేట్‌గా ఉండేవి. 1949 లో అవి నిజాం తన ఒక ఫర్మాన ద్వారా (05--02--1949 ) ప్రభుత్వ దివాని వ్యవస్థలో విలీనం చేయబడ్డాయి. నిజాం వ్యక్తి గత ఎస్టేట్, ప్రభుత్వ భూమి/రెవెన్యూ వ్యవస్థగా మారింది. తర్వాత కాలంలో సాగుదారులకు హక్కులుగా మార్చడం, భూమి లేనివారికి పంపిణీ చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం సర్ఫ్  భూముల నుంచి పరిపాలనా ఖర్చులు తీసివేసిన తరువాత నిజాంకు సుమారు రూ.1.24 కోట్ల నికర ఆదాయం సంవత్సరానికి వచ్చేది.

దానికి బదులుగా ప్రభు త్వం రూ.25 లక్షల వార్షిక రుసుము నిర్ణయించింది. అంటే రూ.1.24 కోట్ల నికర ఆదాయానికి బదులుగా రూ.25 లక్షల వార్షిక చెల్లింపు. సంవత్సరానికి రాజభరణాల చెల్లింపు రూ.50 లక్షలు, భూముల ఆదాయానికి బదులుగా రూ.25 లక్షలు, రాజభవనాల నిర్వహణ మొదలైన వాటికి రూ.25 లక్షలు.. మొత్తం ఒక కోటి రూపాయలు.  ఇవి 26వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో రద్దు చేయబడ్డాయి. 1971 వరకు చెల్లింపులు జరిగాయి.

కౌలు దారు చట్టం (హైదరాబాద్ టెనాసీ యాక్ట్ ) భూమిని సాగు చేసేవాడికి హక్కు- : ఇక్కడి నుంచి నిజమైన భూ సంస్కరణల రెండో దశ ప్రారం భమైంది. 1950 లోరక్షిత కౌలుదారు అనే కీలక భావన వచ్చింది.

ఒక భూమిని నిర్దిష్ట కాలం నిరంతరంగా వ్యక్తిగతంగా సాగు చేసిన కౌలుదా రుడికి రక్షిత కౌలు హక్కు కల్పించే నిబంధనలు వచ్చాయి. తర్వాత సెక్షన్ ద్వారా రక్షిత కౌలుదారుకు భూస్వామి వాటాను కొనుగోలు చేసే హక్కు వచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాం తాల్లో రక్షిత కౌలుదారు సాగు చేస్తున్న భూమి యాజమాన్యం అతనికి బదిలీ అయ్యే విధానం ఏర్పడింది. ఇది కౌలుదారు నుంచి యజమాని మార్పుకు చట్ట పరమైన పునాది. సుమారు1,06,965 మంది రక్షిత కౌలుదారులు 5,95,280  

భూములపై యాజమాన్య హక్కు పొందారు. అంటే ఒక రక్షిత కౌలుదారుకు సుమారు 5.56 ఎకరాల భూమి వచ్చింది.

ఇనాం రద్దు చట్టం : నిజాంకాలంలో సేవలు, మతం, ధార్మిక/దాతృత్వం మొదలైన కారణాలతో పొందిన ఇనాం భూము లపై ఇనాందార్లకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేయడం జరిగింది. ఇందు కోసం హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) ఇనాంల రద్దు చట్టం వచ్చింది.  ఇది కూడా గ్రామీణ భూ సంబంధాలను మార్చిన మరో ముఖ్యమైన అడుగు. తరువాతి కా లంలో సుమారు 1.18 లక్షల మందికి 6 లక్షల ఎకరాలకు పైగా ఇనాం పట్టాలు వచ్చాయి.    

భూ పరిమితి.. రెండో విప్లవాత్మక దశ- : ఒకటి జాగీర్ నిర్ములన, కౌలు సంస్కరణల తర్వాత కూడా ఒక సమస్య మిగి లింది. పెద్ద భూస్వామి ఎంత భూమి అయినా ఉంచుకోవచ్చా? దీనికి సమాధానంగా భూ పరిమితి వచ్చింది. ఆంధ్రప్ర దేశ్/తెలంగాణ భూ సంస్కరణల () చట్టం, 1973 పెద్ద వ్యవసాయభూమిపై గరిష్ట పరిమితి (సీలింగ్) విధించి మిగులు భూమిని ప్రభుత్వానికి అప్పగించే చట్ట పరమైన మార్గాన్ని చూపింది. ఇది ఎంతో సాహసోపేతక చర్య. ఇది చేసినందుకు గాను అప్ప టి ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు తన ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. 3,14,981 ఎకరాల సీలింగ్, సర్‌ప్లస్ లాండ్‌ను 1,85,202 భూమి లేని పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. అంటే సగటున సుమారు 1.70 ఎకరాలు ప్రతి కుటుంబానికి వచ్చింది.     

భూ పంపిణీ నిజంగా ఎంత జరిగింది?

 సుమారు 6 లక్షల ఎకరాల ఇనాం భూములకు 1.18 లక్షల కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. 1,06,965 రక్షిత కౌలుదార్లకు 5,95,280 ఎకరాలకు యాజమా న్య హక్కులు కల్పించారు. 99,155 ఎకరాల భూదాన్ భూములను 36,236 కుటుంబాలకు పంపిణీ చేశారు. 16,56,150 ఎకరాల ప్రభుత్వ భూములను 12,34,552 కుటుంబాలకు పంచా రు. 31,032 దళిత కుటుంబాలకు 41,065 ఎకరాలు ఇచ్చారు. మొత్తం సు మారు 33 లక్షల ఎకరాల భూమి పేదల చేతిలోకి వచ్చింది. కానీ కోనేరు రంగారావు కమిటీ 2006లో పేరుకే కాగితాలపై భూమి పంపిణి జరిగింది.. కానీ భౌతికంగా భూ పంపిణీ జరగ లేదు అని తేల్చి చెప్పింది.

అదే విధంగా తెలంగాణలో గిరిజనులు, ఇతర అర్హులైన అటవీ నివా సులకు అటవీ భూమిములపై హక్కులను పట్టాల రూపంలో గుర్తించారు. తెలంగాణలో 31 మే 2025 నాటికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం సుమారు 11.27 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కులు గుర్తించి పట్టా లు ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత హక్కుల కింద సుమారు 6.70 లక్షల ఎకరాలు, సామూహిక హక్కుల కింద సుమారు 4.58 లక్షల ఎకరాలు ఉన్నాయి

భూ సంస్కరణలు ఎందుకు పూర్తిగా విజయవంతం కాలేదు? : పెద్ద భూస్వాములకు ఆర్థిక శక్తి, స్థానిక పరిపాలనతో సంబంధాలు, న్యాయపరమైన పరిజ్ఞానం, రాజకీయ ప్రభావం ఉండేవి. మరోవైపు కౌలుదారుడు పేదవాడు, అక్షరాస్యత త క్కువ, పత్రాలు లేవు, న్యాయపరమైన పో రాటానికి డబ్బు లేదు. చట్టం వచ్చింది కానీ చట్టబద్ధమైన హక్కు వాస్తవ భూ యాజమాన్యంగా మారడానికి దశాబ్దాలు పట్టింది.

తెలంగాణలో భూపోరాటాలు : - తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం (1946 - 51), సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటం 1977, నక్సలైట్/మావోయిస్టు ఉద్యమాలు (1973 -2014) జరిగాయి. భూ సంస్కరణ చట్టాలు, కోనేరు రంగారావు కమిటీ రిపోర్ట్.. ఇన్ని వచ్చినా భూమి నేటికీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది. సీపెక్ సంస్థ సర్వే 2024 ప్రకారం రెడ్డి సామాజికవర్గం చేతిలో 13.5% , వెలమల చేతిలో 1%, కమ్మలు 2% భూమి కలిగి ఉన్నారు. అంటే ఈ మూడు ఆధిపత్య కులాల జనాభా  మొత్తం 6.2% కాగా.. 16.5% భూమి వారి చేతిలోనే ఉంది.  

 పూర్తిగా సమానత్వం కాదు : 2021--22 వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో 70.60 లక్షల వ్యవసాయ భూములు చిన్న కమతాలుగా విభజింపబడింది. కమతాల సంఖ్య 68.7% కాగా  అందులో 22.7% చిన్న కమతాలు, 7.1% మధ్యస్థ కమతాలు, 1.4% మధ్యస్థ కమతాలుగా విభజింపబడింది. పెద్ద కమతాలు కేవలం 0.1% మాత్రమే ఉన్నాయి.  మొ త్తం సాగు భూమిలో ఉపాంత కమతాలు 32.8%, చిన్న కమతాలు 35.4%,  మధ్య స్థ స్థాయి చిన్న కమతాలు 20.5%, మధ్యస్థ 8.7%, పెద్ద కమతాల వాటా 2.6% ఉంది. అంటే భూమి చిన్నచిన్న ముక్కలుగా విభజించబడింది. ఈ చిన్న మరియు ఉపాంత భూములు ఏ సామాజిక వర్గాల చేతిలో ఉన్నాయనేది ప్రశ్న? అక్కడ సామాజిక న్యాయం మళ్లీ ముందుకు వస్తుంది.

సీపెక్ సర్వే ఏం చెబుతోంది?: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సీపెక్)-2024 నివేదికను విశ్లేషించిన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్-2025లో భూమి యాజమాన్యాన్ని కుల/సామాజిక వర్గాల ఆవరీ గా కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ నివేదిక ప్రకారం.. 5 ఎకరాల కంటే తక్కువ చిన్న కమతాలు కలిగిన కుటుంబాల వివరాలు సామాజిక వర్గాల వారీగా చూస్తే .. ఎస్సీ 90.5%, బీసీ 85.0%చ ఎస్టీ 80.1%, జనరల్/ఓసీ 69.1% కలిగి ఉన్నారు.

అంటే తెలంగాణలో అత్యధిక శాతం ఎస్సీ, బీసీ కుటుంబాలు చిన్న కమతాలనే కలిగి ఉన్నాయని స్పష్టమవుతోంది. 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న  కు టుంబాల విషయంలో ఎస్సీ 1.0%, ఎస్టీ 2.0%, బీసీ 2.9%, ఓసీ/జనరల్ 4.4% ఉన్నట్లు సీపెక్ సర్వేపేర్కొంది. భూ సంస్కరణలు పెద్ద భూస్వామ్యాన్ని బలంగా తగ్గించాయి. కానీ భూమి ద్వారా ఏర్పడిన సామాజిక,-ఆర్థిక అసమానత పూర్తిగా అంతరించ లేదు.

కులం, భూమి సంబంధం నేటికీ కీలకంగానే.. : భూమి కేవలం ఆస్తి కాదు. ఆదాయం + ఆర్థిక భద్రత + రుణం పొం దే సామర్థ్యం + సామాజిక గౌరవం + గ్రామంలో బేరమాడే శక్తి + రాజకీయ ప్రభావం. భూమి బహుజనుల చేతుల్లోకి వచ్చింది కూడా పూర్తి నిజం కాదు. భూమి పొందిన కుటుంబాల్లో చాలా మందికి సాగుకు పనికి రాని, నీటి వసతి లేని ఖుష్కి భూములు. చిన్న భూకమతాలుగా పంపకాలు, అప్పులు, కుటుంబ విభజనవల్ల భూమి ద్వారా పెద్ద ఆర్థిక శక్తి ఏర్పడలేదు. మరోవైపు చారిత్రకంగా పెద్ద భూస్వామ్యాన్ని కలిగి ఉన్న సామాజిక వర్గాల కుటుంబాల్లో కొంత భూమి తరతరాలకు కొనసాగింది. అలాగే భూమి పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ మార్పిడి ద్వారా మరో రూపంలో సంపద గా మారింది.

తెలంగాణ భూ చరిత్ర చెప్పే అసలు పాఠం : 1948లో నిజాం పాలన ముగిసినప్పుడు రాజకీయ అధికారం మారింది. 1949-55లో సామంత భూవ్యవస్థను చట్టపరంగా కూల్చే ప్రక్రియ ప్రారంభమైంది.1950-70లో కౌలుదారు హక్కు లు, మిగులు భూమి పంపిణి ద్వారా భూమిని విస్తృత ప్రజానీకానికి చేర్చే ప్రయత్నం జరిగింది. చివరగా నక్సలైట్స్/మావోయిస్టు ఉద్యమాల ఫలితంగా వేలా ది ఆధిపత్య కులస్థులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తూ తమ భూములను తక్కువ రేటుకు అమ్ముకోవడం లేదా వదిలి రావటం జరిగింది.

తద్వారా అనేక పెద్ద కుటుంబాల చేతికి కొంత భూమి వచ్చింది. కానీ 2018లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పహాణీ రద్దు చేసి ధరణి పోర్టల్ ద్వారా వేలాది ఎకరాలు భూస్వాముల పక్షం చేసింది. దీంతో మళ్లీ పెద్ద రైతులకు తీవ్ర ఇబ్బందులు జగాయి. అందుకే తెలంగాణ భూ సంస్కరణల చరిత్రను కేవలం దొరల భూమి పేదలకు వచ్చింది అనే సరళమైన కథగా చూడకూడదు. సామంత భూసంబంధాలు చట్టపరంగా కూలిపోయాయి, లక్షలాది సాగుదారులకు హక్కు లు వచ్చాయి, పెద్ద భూస్వామ్యం గణనీయంగా తగ్గింది.. కానీ భూమి పరిమాణం, భూమి నాణ్యత, నీటి వనరులు, మూలధనం, కులం, మార్కెట్ మరియు రాజకీ య శక్తి మధ్య ఉన్న అసమానతలు పూర్తి గా తొలగిపోలేదు.

భూమి కేవలం ఆస్తి హక్కు కాదు, అది ఆత్మగౌరవం మరియు గ్రామీణ అధికార సంబంధాల్లో కీలకమైన ఆధారం. ఈ భాగంలో ఇప్పటివరకు మనం నిజాం కాలంలోని ఫ్యూడల్ భూ సంబంధాలు, తర్వాత స్వాతంత్ర భారతం లో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిన భూసంస్కరణల గురిం చి తెలుసుకున్నాం. రెండో భాగంలో భూ మిపై యాజమాన్య హక్కులు ప్రతిబింబింపజేసే రికార్డులు.. ముఖ్యంగా కాస్రా పహా నీ, రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం-1971, 1989 లోని మార్పులు, పాస్‌బుక్స్, టైటిల్ డీడ్స్ అదే విధంగా భూరికార్డుల డిజిటలైజేషన్, ధరణి, భూభారతిల గురించి చర్చిద్దాం.

 వ్యాసకర్త : విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్

మరిన్ని వార్తలు