ఆహార భద్రతకు చర్యలెక్కడ?
నండూరి రవిశంకర్ :
ప్రజలకు కల్తీ లేని, నాణ్యమైన ఆహారాన్ని, సురక్షితమైన ఔషధాలను అందించాలనే అత్యంత ఉన్నతమైన, శ్రేయోదాయకమైన ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ’టీజీ సేఫ్(TG Safe)’ పేరిట ఓ వ్యవస్థను రూపొందించింది. ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత)(Food Security), డ్రగ్ కంట్రోల్(Drug Control) (ఔషధ నియంత్రణ) విభాగాలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. ఆహార, ఔషధ రంగాధారిత నేరాలను, నాణ్యతా లోపాలను అరికట్టాలని భావించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి(Senior IPS officer Avinash Mohanty) నాయకత్వంలో క్షేత్రస్థాయిలో జరిపిన మెరుపు దాడుల పరం పర ప్రజల్లో కొండంత ఆశలు నింపింది.
దశాబ్దాలుగా ఎవరూ కన్నెత్తి చూడటానికి కూడా సాహసించని చారిత్రక ఓల్డ్ సిటీ మొదలుకొని, ఆధునీకతకు చిరునామాగా మారిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఐటీ కారిడార్ వరకు ప్రముఖ రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఈ-కామర్స్ సంస్థల గోదాములపై అధికారులు విరుచుకుపడ్డారు. ఆకస్మిక తనిఖీ లతో నిబంధనలు ఉల్లంఘించే హోటల్ ని ర్వాహకుల గుండెల్లో దడ పుట్టించారు. అ యితే, ఎంతో ఆర్భాటంగా, పబ్లిసిటీతో సా గుతున్న ఈ దాడుల వెనుక ఉన్న నిశ్చల వాస్తవ పరిస్థితిని లోతుగా పరిశీలిస్తే మాత్రం ‘టీజీ సేఫ్’ కాస్తా ‘టీజీ అన్‌సేఫ్’గా మారుతోందా అనే సందేహాలు, ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
అధికారులు హోటళ్లపై దాడులు చేయ డం, వంటగదుల్లో భయంకర పరిస్థితుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం, నోటీసుల జారీ, చివరకు లైసెన్సులు రద్దు చేయడం వరకు ప్రక్రియ బాగానే సాగుతోంది. కానీ, ఆ త ర్వాతి ఘట్టంలోనే అసలు నాటకం మొదలవుతోంది. లైసెన్సులు రద్దయిన కొద్ది రో జులకే.. కొన్ని చోట్లయితే మరుసటి రోజే ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఏమాత్రం మార్పు లేకుం డా, పాత పద్ధతిలోనే అపరిశుభ్రమైన వా తావరణంలో కల్తీ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.
ఇటీవల రాజధానిలోని ఐటీ కారిడార్‌లో ఆహార భద్రతా నియమాలను పూర్తి గా తుంగలో తొక్కిన 11 ప్రముఖ రెస్టారెం ట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను టీజీ సేఫ్ రద్దు చేసింది. వాటి వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి లోని ప్రముఖ ‘అంతేరా కిచెన్ అండ్ బార్’ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినప్పటికీ, నిర్వాహకులు ఏమాత్రం భయం లేకుండా ఆదివారం నాడు దర్జాగా హోటల్ తెరిచి వ్యాపారం సాగించడం శోచనీయం. వంట గదుల్లో తీవ్రమైన అపరిశుభ్రత, ఆహార పదార్థాలలో క్రిములు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల ఆనవాళ్లు, రసాయ నాలు చల్లిన కుళ్లిన మాంసం కనిపించినట్లు స్వయంగా తనిఖీ అధికారులే నిర్ధారించారు.
అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నట్లు తేలినప్పటికీ, సదరు హోటల్ ఎలాంటి అడ్డంకి లేకుండా కస్టమర్లకు సేవలు అందించడం ఫుడ్ సేఫ్టీ అధికా రుల వైఫల్యానికి, నిస్సహాయతకు స జీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది ఒక్క ’అంతేరా’ కేఫేకు మాత్రమే పరిమితమైన సమ స్య కాదు.. లైసెన్సులు రద్దయిన అనేక హోట ళ్లు, ఈ- అనుబంధ కిచెన్లు చట్టా న్ని, అధికారులను తృణప్రాయంగా భావి స్తూ తమ దందాను నడిపిస్తున్నాయని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలో ఉన్న లొసుగులు, అత్యంత నామమాత్రపు శిక్షలే అని చెప్పక తప్పదు. చట్టం ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలకు నోటీసులివ్వడం, జరిమానాలు విధించడం వర కు అధికారులు చేస్తున్నారు. కానీ, రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం చేసే బడా హోటళ్లకు, కార్పొరేట్ రెస్టారెంట్లకు రూ.10 వేలో లేక రూ.50 వేలో జరిమానా విధించడం నీటిపై రాతలతో సమానం. ఆ జరిమానా మొత్తం వారి దైనందిన రాబడితో పోలిస్తే అత్యంత స్వల్పం. చట్టంలోని సడలింపులను ఆసరాగా చేసుకుని ‘ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు’ చూపించడమో, లేదా నామమాత్రపు జరిమానాలు చెల్లించి కేసులను నీరుగార్చడమో చేస్తూ, మరుసటి రోజే మళ్లీ అదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
కేవలం తనిఖీలు నిర్వహించి, సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేస్తే వ్యవస్థలో మార్పు రాదని ప్రజాసంఘాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ వేదికలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజారో గ్యంతో చెలగాటమాడే నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటేనే నిర్వాహకు ల్లో చట్టం పట్ల భయం ఏర్పడుతుంది. ఒకసారి లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా సదరు దుకాణం లేదా రెస్టారెంట్ తెరిచి ఉంటే, ఆ ప్రాంగణానికి భౌతికంగా సీల్ వేయడం, యజమానులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టే చట్టబద్ధ చర్యలను అధికారులు పూర్తిస్థాయిలో ప్రయోగించలేకపోవడం వెనుక ఏ అధికారిక లేదా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.
మరోవైపు ప్రజల వైఖరి కూడా ఈ నిర్వాహకులకు మరింత ధైర్యాన్ని ఇస్తోం ది. అధికారుల తనిఖీల్లో ఆహారం కల్తీ అని, తీవ్రమైన అపరిశుభ్రత ఉందని బయటపడినప్పటికీ, ప్రజలు అసలు విషయాలు తెలియకనో, తెలిసినా అలసత్వంతోనో లే దా నామోషి వదిలేసి ఆయా హోటళ్లకు పోటెత్తుతున్నారు. వీకెండ్స్ లేదా సాయం త్రం వేళల్లో కల్తీకి నిలయాలుగా మారిన రెస్టారెంట్ల ముందు క్యూలు కట్టడం శోచనీయం. వినియోగదారులలో అవగాహన లోపించడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ హించడం హోటల్ నిర్వాహకులకు బాధ్యతారాహిత్యాన్ని మరింత పెంచుతోంది.
సమగ్రంగా పరిశీలిస్తే, ఒకవైపు డ్రగ్ కంట్రోల్ విభాగం తనిఖీల విషయంలో పూర్తిగా స్తబ్ధంగా మారిపోగా, మరోవైపు రాత్రింబవళ్లు కష్టపడి ఫుడ్ సేఫ్టీ విభాగం చేపడుతున్న దాడులు సైతం ఆచరణాత్మక చర్యలు లేక చివరకు నిష్ఫలంగా మారుతున్నాయి. దాడులు చేయడం, నోటీసులు ఇవ్వడం.. ఆ తర్వాత కొద్ది రోజులకే హో టళ్లు యథావిధిగా ప్రారంభమవడం అనే ఈ విషవలయానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.
దాడులకు, ఆ తర్వా త జరిగే చట్టపరమైన చర్యలకు మధ్య ఉన్న పెద్ద గ్యాప్‌ను పూడ్చేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఫుడ్ సేఫ్టీ చట్ట సవరణలు తెచ్చి, సీలింగ్ అధికారాలను కల్పిం చడం, కఠినమైన జైలు శిక్షలు అమలు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించడం వంటి విప్లవాత్మక సం స్కరణలు తీసుకురావాలి. అప్పుడే ‘టీజీ సేఫ్’ అనే పేరుకు సార్థకత చేకూరుతుంది, ప్రజల ఆరోగ్యానికి అసలైన భద్రత లభిస్తుంది.
సీనియర్ జర్నలిస్టు
9912483642
హైదరాబాద్