1 September, 2026 | 12:38 AM

అలా మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది!

01-09-2026 12:00 AM

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ అనంతిక విలేకరులతో పంచుకుంది. 


‘8 వసంతాలు’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నా. అవి నన్ను ఆకట్టుకోలేదు. ఆ టైమ్‌లో ‘రోమాంచకం’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. ఈ కథ విన్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మూవీలో కదా నటించాలని కోరుకున్నానను అనే ఫీల్ కలిగింది. ఈ సినిమాలో నేను బబ్లీ గర్ల్, సరదాగా ఉండే అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. ఇలాంటి క్యారెక్టర్‌లో నటించాలనేది నా డ్రీమ్‌గా ఉండేది. యూత్ ఆడియెన్స్ బాగా రిలేట్ అయ్యే చిత్రమిది. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు ప్రేమతోపాటు హాస్యం ఉత్కంఠ కూడా ఉంటాయి. 


నేను ఈ చిత్రంలో తమిళ అమ్మాయిగా కనిపిస్తా. ఈ తరంలో యువత జీవితాల్లో ఎలాంటివి జరుగుతున్నాయో అలాంటి కాంటెంపరరీ ఎలిమెంట్స్ మా సినిమాలో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇది ప్రేమ కథా చిత్రమే. కానీ యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా కోసం సుమంత్ ప్రభాస్ ఎక్కువ రోజులు వర్క్‌షాప్ చేశాడు. ఆయనతో పోల్చితే నేను చాలా తక్కువ వర్క్‌షాప్స్ చేశాను. సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీపడేలా డిజైన్ చేశారు. మా రెండు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు లైవ్‌లీగా, నిజంగా ఒక జంట మధ్య జరుగుతున్నట్లు నేచురల్‌గా అనిపిస్తాయి. అయితే ఆ సీన్స్‌లో ఎక్కడా ల్యాగ్ ఉండదు. సీన్స్ స్పీడ్‌గా వెళ్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి.


‘రోమాంచకం’ డిఫరెంట్ జానర్. ‘8 వసంతాలు’ లాంటి బలమైన భావోద్వేగాలున్న సినిమా చేయాలని కోరుకున్నా. ప్రేమకథల్లో కూడా నటించాలని ఉండేది. ఈ సినిమా మీకు ఎంత సరదాగా ఉంటుందో మా షూటింగ్ కూడా అలాగే ఫన్‌తో సరదాగా సాగింది. ఈ రెండు చిత్రాలకు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా దేనికదే ప్రత్యేకమైనది.  


- పర్టిక్యులర్‌గా ఈ సినిమాలో కొన్ని సీన్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. కొన్నిసార్లు నటిస్తున్నప్పుడే మనకు ఒక హ్యాపీనెస్ కలుగుతుంది, ఆ జాయ్‌ను ఫీల్ అవుతాం. అలాంటి సీన్స్ ఈ మూవీలో చాలా ఉన్నాయి. నా పర్‌ఫార్మెన్స్ చూసి సందీప్‌రెడ్డి మెచ్చుకున్నారు. ప్రేక్షకుల స్పందన కోసం వేచిచూస్తున్నా. సుమంత్ ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్ ఆఫీస్‌లో చూసిన రోజు మేము బాగా మాట్లాడుకున్నాం. ఒక ఫ్రెండ్ అనే ఫీల్ కలిగింది. కొన్ని లెంగ్తీ సీన్స్ రిహార్సల్స్ చేశాం. అలా మా మధ్య ఆన్‌స్క్రీన్ మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రొడ్యూసర్ ప్రణయ్‌రెడ్డిని ఫస్ట్ చూసినప్పుడు ఆయనకు కోపం ఎక్కువేమో అనుకున్నా. కానీ ఆయన చాలా మంచి వారని, సరదాగా ఉంటారని తర్వాత అర్థమైంది.


* తమిళంతోపాటు మలయాళం, తెలుగులో నటిస్తున్నా. అవకాశాలను బట్టి వాటిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నా. ఏ భాషను ఇగ్నోర్ చేయడం లేదు. ఎక్కడ అవకాశాలు వస్తే ఆ మూవీస్ చేస్తూ వస్తున్నా. 


చిన్నప్పటి నుంచి ఆర్ట్ నా జీవితం. కళ లేకుంటే నా జీవితం లేదు. డ్యాన్స్, ఫైట్స్.. ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. ఎల్‌కేజీ నుంచే ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవడం అలవాటు అయ్యాయి. ఊరికే ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. నాకు దేవుడు రోజులో చాలా ఎక్కువ టైమ్ ఇచ్చాడని భావిస్తుంటా. ఇవన్నీ నటిగా నాకు ఎంతో హెల్ప్ అయ్యాయి. కృష్ణుడు, సత్యభామలా డ్యాన్స్ చేస్తాం. ఇక్కడ వివిధ పాత్రల్లో నటిస్తాం. అలా డ్యాన్స్ వల్ల నటిగా మెరుగయ్యాను.


‘8 వసంతాలు’ సినిమాలో నాయికగా నాకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రంలో నాతో పాటు హీరోకు కూడా మంచి పేరు వస్తుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలని ఉంది. నటిగా కొత్త తరహా పాత్రలు, సినిమాలు, జానర్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు నేను సంతృప్తి చెందాలి, ఆ క్యారెక్టర్ నాకు సంతోషాన్నివ్వాలి.


* ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఈ మూడు ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమ వల్లే అవుతుంది. అదెలా జరిగిందనేది సినిమాలో చూడాలి. నేను గతంలో చేసిన క్యారెక్టర్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ రోల్. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా సరదాగా చేశామో, థియేటర్లలో ఆడియెన్స్ సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళంలో కొత్త ప్రాజెక్టులకు చర్చలు జరుగుతున్నాయి.