ఆ పాపం కాంగ్రెస్‌దే!
- రైతులకు పంటలు దూరం చేస్తున్నరు
- విద్యుత్ సరఫరా లేక కాలిపోతున్న మోటార్లు
- వందల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
- మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాల పరిశీలన
- విద్యుత్ కేంద్రంలో అధికారుల నిలదీత
సూర్యాపేట,సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్‌దేనని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ(Suryapet Constituency) పరిధిలోని పెన్‌పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాల(Crop fields)ను సోమవారం స్వయంగా పరిశీలించి, రైతులతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీదెళ్ల విద్యుత్ కేంద్రం(Chidella Power Station)లో లాగ్ బుక్ తనిఖీ(Logbook inspection) చేసి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. ఏ గ్రామంలో చూసినా వందలాది ఎకరాలు ఎండిపోయాయని, వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు ముందే సగం పొలాలే నాటుకోగా, అందులోనూ సగానికి పైగా పంటలు ఎండిపోయే పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పంటలను ఎండబెడుతున్నారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలన తీరు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా తయారైందని విమర్శించారు.
ఉన్న విద్యుత్‌ను కూడా సరిగ్గా సరఫరా చేయలేక మోటార్లు కాలిపోయే దుస్థితి తెచ్చారని విమర్శించారు. కన్నేపల్లి నీటి పంపిణీ కేంద్రాన్ని తెరిస్తే సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ చేతికొచ్చే సమయంలో పంటలను కావాలనే ఎండబెడుతూ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజానికి వాస్తవాలు చూపించేలా పాత్రికే యులు గ్రామాల్లో పర్యటించి సమాచారం సేకరించాలని కోరారు.
రైతాంగం విషయంలో రాజకీయాలు అవసరం లేదని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదని హెచ్చరించారు. తెలంగాణకు కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతంలా తయారయ్యారని, ప్రశ్నిస్తే తతప్పా ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదని వ్యాఖ్యానించారు. కేసిఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు తనపై దాడులు చేసినంత మాత్రాన లేదా మళ్లింపు రాజకీయాలు చేసినంత మాత్రాన ఎండిపోయిన పొలాలను ప్రజలు మర్చిపోరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని నిరంతర విద్యుత్, సాగునీరు అందించాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం తప్పదని హెచ్చరించారు.