బీహార్ బ్యాచ్ హల్‌చల్!
నక్సల్స్‌గడ్డ కరీంనగర్‌లో వరుస దోపిడీలు
- జువెల్లరీ షాపులు, ఏటీఎంలే టార్గెట్
- పక్కా ప్లాన్‌తో దోపిడీలు
- అంతర్రాష్ట్ర ముఠాలకు అడ్డా!
- బెంబేలెత్తుతున్న నగర వాసులు
- పోలీసులకు సవాల్‌గా పరిణామాలు
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా(Karimnagar District) అంటేనే నక్సలైట్ ఉద్యమానికి(Naxalite movement) కేంద్రం. ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఉత్తరాది అధికారులను నియమించిన చరిత్ర ఈ జిల్లాకే ఉంది. ఆ తర్వాత కరీంనగర్ దేశంలోనే 4వ అత్యంత సురక్షిత నగరంగా కూడా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరీంనగర్‌లో వరుస దోపిడీలు జరుగుతున్నాయి. జువెల్లరీ షాపులు(Jewelry shops), ఏటీఎంలే టార్గెట్‌గా బీహార్(Bihar)తోపాటు మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీ ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో పీఎంజే జ్యువెలరీ షాపులో ఈ ఏడాది మే 3వ తేదీని పట్టపగలు దోపిడీ జరిగింది. దాదాపు రూ. 82 లక్షల బంగారాన్ని దుండగులు దోచుకుని, కాల్పులు జరిపి పారిపోయారు. బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఈ దోపిడీకి సూత్రధారి బీహార్‌కు చెందిన నోటోరియస్ గ్యాంగ్‌స్టర్ సుబోధ్ సింగ్ అలియాస్ గోల్డెన్ థీఫ్.
అతను ప్రస్తుతం జైలులో ఉంటూనే ప్లాన్ చేశాడు. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్, మరో ఇద్దరు బీహార్‌కు చెందిన రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్. తర్వాత మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై పీడి యాక్ట్ అమలు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఈ ముఠా ఏప్రిల్ నెలలో పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీలలో బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కర్లుగా నటిస్తూ, గుర్తింపు కార్డులు ఇచ్చి రెక్కీ నిర్వహించింది.
అంతకుముందు పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో ఏటీఎం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లి అందిన కాడికి దోచుకున్నారు. తాజాగా కరీంనగర్ మండలం దుర్శేడ్, తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఏటీఎంలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి సుమారు 16 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు.
నేర నియంత్రణ సవాలే
కరీంనగర్‌లో నక్సల్ ఉద్యమం తగ్గాక కూడా శాంతిభద్రతల కోసం వివిధ రాష్ట్రాల అధికారులు వస్తూనే ఉన్నారు. తాజా పోలీసు వార్షిక నివేదికల ప్రకారం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నేరాలు గణనీయంగా 16 శాతం తగ్గాయి. ఇది వరంగల్, రామగుండం కమిషనరేట్ల కంటే మెరుగైన ఫలితం.
చోరీ సొత్తు రికవరీలో కూడా కరీంనగర్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రికవరీ రేటు 24% పెరిగి, రూ. 2.04 కోట్ల విలువైన సొత్తును ప్రజలకు తిరిగి అప్పగించారు. తీవ్రమైన నేరాలు 9% మహిళలపై నేరాలు 5% తగ్గాయని పోలీసుల అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. స్థానిక నేర నెట్వర్క్‌పై పట్టు కోసం పోలీసులు 5,641 మంది నేరస్థుల సమగ్ర సర్వే కూడా చేపట్టారు.
గతంలో స్థానిక నేరస్థులే ఎక్కువగా ఉంటే, ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర (పర్లీ గ్యాంగ్) వంటి అంతర్రాష్ట్ర ముఠాలు కరీంనగర్‌ను టార్గెట్ చేస్తు న్నాయి. దీనికి కారణం ఇక్కడ బంగారం ధర లు పెరగడం, వాటిని స్థిరాస్తిగా భావించి ఎక్కు వ సంఖ్యలో కొనుగోలు చేసి పెట్టుకోవడం వంటివి నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
నిఘా వైఫల్యమే కారణమా?
ఉమ్మడి కరీంనగర్- ఒకప్పుడు నక్సల్‌బరీలు మోగిన గడ్డ. నేడు టెక్-డ్రివెన్ పోలీసింగ్‌తో నేరాలు 16% తగ్గినా పీఎంజే దోపిడీ వంటి ఘటనలు ఒక హెచ్చరిక లాంటిది. జైలులో ఉన్న బీహార్ గ్యాంగ్‌స్టర్ కరీంనగర్‌లో దోపిడీ ప్లాన్ చేయగలిగితే, కేవలం నాలుగు చక్రాలు కారు వేసుకొని నలుగురు వచ్చి లక్షలాది రూపాయలు నిలువ ఉండే ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్తే ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు, అంతర్రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం. రాజకీయ పార్టీల నేతల భద్రతకే పెద్దపీట వేస్తున్న పోలీస్ యంత్రాంగం ప్రజల భద్రత పట్టించుకునే పరిస్థితి కోసం ఇంకెంత కాలం వేచి చూడాలో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి.