పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
- యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భారీ ఏర్పాట్లు
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తాం
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister for IT and Industries Sridhar Babu) తెలిపారు.
ఇందుకోసం గ్లోబల్ సమ్మిట్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2026’కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. సమ్మిట్ ఏర్పాట్లు, రోడ్‌షోలు, ఎంవోయూలు, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై మంత్రి శ్రీధర్‌బాబు శనివారం అబిడ్స్‌లోని ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశాలు చేశారు. తెలంగాణ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పలు నగరాలు, దేశాల్లో రోడ్ షోలు నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఎంవోయూలపై ప్రత్యేక ఫోకస్
గ్లోబల్ సమ్మిట్‌లో కుదిరే అవగాహన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలోఅప్ చేస్తామని తెలిపారు. భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే రంగాలకు సమ్మిట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు సమగ్రంగా వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్, ప్రోటోకాల్, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్లైన్లు నిర్దేశించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులో అన్ని పనులు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.






