ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత
జూరాల నీళ్లను విడుదల చేయాల్సిందే
సర్కారు వైఖరి మారకపోతే ఉద్యమమే
- ఏపీ నీళ్లు తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం
- రైతులు గోస పడుతుంటే.. సీఎం చిల్లర రాజకీయాలు
- బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టు(Jurala Project) ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరం పంట ఎండినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. “జూరాలలో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయకపోవడం దుర్మార్గం. పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నది” అని ఆయన మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
వరద జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) నీళ్లు తీసుకెళ్తుంటే, తెలంగాణలో నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింద ఉన్న రైతాంగానికి సాగునీరు అందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ నీళ్లు తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని దుయ్యబట్టారు. “ఎల్ నినో(El Nino) కంటే ఎల్ -కాంగ్రెస్‌తోనే తెలంగాణకు ఈ దుస్థితి దాపురించింది” అని ఆయన విమర్శించారు. ఈ ఏడాది కృష్ణా నదిలో తెలంగాణకు అందుబాటులోకి వచ్చిన 248 టీఎంసీల నీటిలో కేవలం 28 టీఎంసీలనే వినియోగించుకోవడం సిగ్గుచేటన్నారు.
అరెస్టులకు భయపడం
“పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy).. పాలమూరు రైతులకు మొదటి శత్రువుగా మారారు. సొంత జిల్లా రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా సీఎం చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది” అని కేటీఆర్ మండిపడ్డారు. నీళ్ల కోసం ఆందోళనకు దిగిన జూరాల ఆయకట్టు రైతాంగానికి సంఘీభావంగా నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది దుర్మార్గ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు బీఆర్‌ఎస్ భయపడబోదన్నారు.
వైఖరి మార్చుకోకుంటే ఉద్యమమే
ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామన్నారు. అన్నదాతల విషయంలో రాజకీయాలు చేస్తే సహించబోమని ఆయన తెలిపారు. పాలమూరు- ప్రాజెక్టులోని నార్లాపూర్ మోటర్లను, కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి మోటర్లను వెంటనే ఆన్ చేసి రైతులకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు.
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చి పంటలను కాపాడాలన్నారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం కుంటి సాకులు చెబుతున్నదని ఆయన విమర్శించారు. తాగునీటి అవసరాలకు కేవలం 2 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిసినా మిగిలిన నీటిని ఆయకట్టు పంటలకు విడుదల చేయకుండా రైతులను సంక్షోభంలోకి నెట్టాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు.
సిరిసిల్ల ప్రజలకు ఏం చెప్తారు?
భూముల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు ఎవరైనా తప్పు చేసి ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చట్టప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు భూముల వద్దకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము చేసిన సవాల్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
“సిరిసిల్లకు వెళ్తానని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడికి వెళ్లి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలకు తానే కారణమని చెప్పుకుంటారా? మూడుసార్లు ఎగ్గొట్టిన రైతుబంధు గురించి ప్రజలకు వివరిస్తారా?” అని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్లుగా సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా చేసిన వారి వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వివరాలు బయటపెట్టలేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినట్లు అంగీకరించి సిరిసిల్ల ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.