పట్టుచీరపై అమ్మవారి చరిత్ర
చేనేత మగ్గంపై చరిత్రను ఆవిష్కరించిన అపూర్వ కళాఖండం సిరిసిల్లలో(Sircilla extraordinary masterpiece) రూపుదిద్దుకుంది. ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై అద్భుతంగా నేశారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి కోటేశ్వరరావు ప్రత్యేక ఆర్డర్ మేరకు సుమారు 45 రోజులపాటు శ్రమించి రూపొందించిన ఈ చీరలో భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, చేనేత నైపుణ్యం కనిపిస్తున్నాయి.
102 రుషులు, 102 గోత్రాలు, 25 చిత్రాలు
ఈ ప్రత్యేక పట్టుచీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ప్రతిబింబించే 25 చారిత్రక చిత్రాలను మగ్గంపై నేశారు. ఒక్కో అక్షరం, ఒక్కో గోత్రనామం, ఒక్కో చారిత్రక చిత్రాన్ని అత్యంత జాగ్రత్తగా పట్టుదారంతో రూపొందించడం విశేషం. సుమారు 7 మీటర్ల పొడవైన ఈ పట్టుచీరకు 2 గ్రాముల బంగారు జరి ఉపయోగించారు.
సాధారణంగా చీర నేయడం ఒక కళ. అయితే చరిత్రను చిత్రాలుగా, గోత్రాలను అక్షరాలుగా, రుషుల పేర్లను చేనేత డిజైన్లుగా మలచడం అరుదైన ప్రతిభకు నిదర్శనం. భావితరాలకు వాసవి అమ్మవారి దివ్య చరిత్రను ప్రత్యేక కళారూపంలో అందించాలనే ఉద్దేశంతో ఈ కళాఖండాన్ని రూపొందించానని హరిప్రసాద్ అన్నారు.
భక్తి, చరిత్ర, చేనేత.. మూడింటి గుర్తింపు
రత్నకుమారి కోటేశ్వరరావు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్‌ను స్వీకరించి 45 రోజులపాటు నిరంతరం శ్రమించిన హరిప్రసాద్ ఈ అపూర్వ కళాఖండాన్ని రూపొందించారు. చేనేత కళాకారుడి ఓర్పు, సృజనాత్మకత, నైపుణ్యానికి ఈ పట్టుచీర ప్రతీకగా నిలుస్తోంది. చరిత్రను చదవడమే కాదు.. చీరగా నేయవచ్చని నిరూపించిన సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్.
గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర
వెల్దిహరి ప్రసాద్ గతంలో 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. వేగం, నైపుణ్యం, ఖచ్చితత్వం, సమన్వయం చేస్తూ చేనేత రంగంలో తనదైన ముద్ర వేశారు. చేనేత కళాకారుడు హరిప్రసాద్ ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్రను 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలతో ఒకే పట్టుచీరపై ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది.