దోపిడీకి తెగబడిన దొంగలు

20-09-2026 | 08:08am

రెండు ఎస్బీఐ ఏటీఎంలలో చోరీ

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): కరీంనగర్ కమిషనరేట్(Karimnagar Commissionerate) పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి పోలీసులకు సవాల్ విసిరారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిమ్మాపూర్ మండలంలో ని ఎస్బీఐ(State Bank of India) ఎటీఎం, కరీంనగర్ రూరల్ మండలం దురుచేడు గ్రామంలోని ఏటీఎంలను కొద్దిపాటి తేడా సమయంలో కొల్లగొట్టి నగదును అపహరించుకుపోయారు. ఆదివారం ఉదయం జన సందడి మొదలైన తర్వాత ఏటీఎంలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి నగదు అపహరించినట్లుగా ఘటన స్థలంలో దొరికిన ఆధారాలును బట్టి పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. దుర్షేడ్ గ్రామం(Durshed Village) దోపిడీ ఘటనలో లభించిన ఆనవాళ్ళ ఆధారంగా దుండగులు తొలుత ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు పై స్ప్రే చేసి కేబులు కట్ చేసి అనంతరం దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

చోరీకి పాల్పడిన దుండగులు ఎంతమంది అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల జాడ కోసం గాలింపులు ముమ్మరం చేశారు.  ఈ ఘటనలో దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. ఏటీఎం చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు. ఘటనలో ఎంతమంది పాల్గొన్నారనే కోణంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆరా తీస్తున్నారు. ఏటీఎంలో అపారనకు గురైన నగదు విలువ ఎంత అన్నది స్పష్టంగా తెలియ రాలేదు. బ్యాంకు అధికారులు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఎంత నగదు అపహరణకు గురైంది అన్న వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు