21 August, 2026 | 9:17 AM

దొంగలు బాబోయ్.. దొంగలు

21-08-2026 08:44 AM

కోలమద్ది గ్రామంలో మూడిళ్లలో చోరీ

తాళం వేసిన ఇళ్లే టార్గెట్… అందిన కాడికి దోచుకెళ్లిన దొంగలు

గంభీరావుపేట,ఆగస్టు 21(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో దొంగలు హల్‌చల్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు జరుపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని కోలమద్ది గ్రామంలో తాళాలు వేసి వెళ్లిన మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మంజుల, దీప, రాజు ఇళ్లలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకున్న దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి అందిన కాడికి దోచుకెళ్లారు.

మంజుల ఇంటిలో 1 తులం బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, దీప ఇంటిలో 1 తులం బంగారం, రూ.5 వేల నగదు, రాజు ఇంటిలో 6 తులాల వెండి, రూ.3 వేల నగదు దోచుకెళ్ళారు. ఇటీవల మండల కేంద్రంలో గతంలో నర్మాల , దమ్మన్నపేట, లింగన్నపేట గ్రామాల్లో కూడా ఇలాంటి చోరీలు జరగడం గమనార్హం. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతూ బయట ఊర్లకు వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. దీనిపై పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.