తెచ్చింది ఎవరు.. తీసుకెళ్లేది ఎవరు?

03-10-2026 | 02:30pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్‌ మండల కేంద్రానికి మంజూరైన రూ.200 కోట్ల యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(Young India Integrated Residential School)ను వేరే ప్రాంతానికి తరలించొద్దంటూ టీఆర్‌ఎస్‌ మండల కార్యకర్తలు శనివారం భిక్కనూర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. భిక్కనూర్‌లోనే పాఠశాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల స్కూల్‌ను కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి పరిధిలో నిర్మించనున్నట్లు సోషల్‌ మీడియా, కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రచారాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌(Former MLA Gampa Govardhan) ఆదేశాల మేరకు ఈ ఆందోళన చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

ఆందోళనకారులు ‘ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ తెచ్చింది ఎవరు.. తీసుకెళ్లేది ఎవరు?’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ " గతంలో భిక్కనూర్‌కు రూ.200 కోట్ల పాఠశాల మంజూరైన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ(Government Advisor Shabbir Ali)కి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్‌ నాయకులు, ప్రస్తుతం తరలింపు ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తూతూమంత్రపు వినతిపత్రాలతో కాకుండా తక్షణమే స్పందించి భిక్కనూర్‌లోనే పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు". సుమారు గంటపాటు రాస్తారోకో జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి పంపించారు. కార్యక్రమంలో మండల, గ్రామ కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, నాయకులు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు