రష్యాపై ట్రంప్ సరికొత్త ఆంక్షలు!

18-09-2026 | 05:15am
  1. బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
  2. ట్రంప్‌నకు అదనపు అధికారాలపై డెమోక్రాట్ల అభ్యంతరం
  3. భారత్‌కు 100 శాతం టారిఫ్‌ల ముప్పు?

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: రష్యాపై (Russia) సరికొత్త ఆంక్షలను విధించడానికి అమెరికా (America)సిద్ధమైంది. మాస్కో నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్‌పైనా 100 శాతం పన్నుల ప్రమాదం పొంచివుంది. అలాగే చైనా వంటి దేశాలపైనా భారీ సుంకాలు మోపే పూర్తి అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) రానుంది. అమెరికా ఆరోపిస్తున్న ‘షాడో ఫ్లీట్’ నౌకలపైన కూడా తమ ఆధిపత్యాన్ని చలాయించే పవర్ దక్కనుంది. ఈ కీలక బిల్లును అమెరికా ప్రతినిధుల సభ గురువారం ఆమోదించింది.

‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును హౌస్ 262- ఓట్ల తేడాతో పెద్దల సభలో పాసైంది. గత నెలలోనే సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు, ట్రంప్ సంతకం తర్వాత అధికారిక చట్టంగా మారనుంది. అయితే ట్రంప్‌నకు అదనపు సుంకాధికారాలపై డెమోక్రాట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా 203 మంది రిపబ్లికన్లతో పాటు, 58 మంది డెమోక్రాట్లు, ఒక స్వతంత్ర సభ్యుడు ఓటు వేశారు.

అధ్యక్షుడికి అపరిమిత సుంకాల అధికారాలు ఇవ్వడాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏడుగురు రిపబ్లికన్లు, 152 మంది డెమోక్రాట్లు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. రష్యా ఇంధన వనరులపై ఆధారపడే భారత్, చైనా సహా ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీ సుంకాలు విధించే పూర్తి అధికారాలను ఈ చట్టం ట్రంప్‌నకు ఇస్తుంది. అలాగే అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకుంటూ తక్కువ ధరకే రష్యా చమురును విదేశాలకు సరఫరా చేస్తున్న ‘షాడో ఫ్లీట్’ నౌకలు, ఇంధన రంగం, రష్యా నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. 

ఇరాన్ ఇంధన రంగంపైనా, వారి భాగస్వామ్య వ్యవస్థలపైనా అదనపు ఆంక్షలు అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ పరిణామం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా  ఈ చర్యకు దిగింది. రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాలకు ఇకపై అమెరికాతో వాణిజ్యం ఖరీదుగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

రష్యా ముడి చమురు, సహజ వాయువును కొనుగోలుచేసే ఐదు అతిపెద్ద దేశాల వస్తువులపై 100 శాతం వరకు అదనపు సుంకాలను విధించే అధికారాన్ని కూడా ఈ చట్టం అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) తెలిపింది. రష్యా ముడి చమురును ప్రధానంగా కొనుగోలు చేసే భారత్, చైనాలు లక్ష్యంగా మారే అవకాశం ఉందని, భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు పడొచ్చని ఆ సంస్థ పేర్కొంది.

భారత్‌కు సెనేటర్ల హెచ్చరికలు 

రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందిన అనంతరం అమెరికా సెనేటర్లు భారత్, చైనాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ‘చైనా, భారత్ తమ చమురు, గ్యాస్ అవసరాల కోసం వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం మంచిది’ అని సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ పేర్కొన్నారు.

రష్యా షాడో ఫ్లీట్ ద్వారా చౌకగా లభించే చమురును కొనుగోలు చేస్తున్న దేశాలు భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సెనేటర్ జీన్ షాహీన్ స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు రానున్న కొద్దిరోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరిన్ని వార్తలు