ఇద్దరు గంజాయి విక్రెతలు అరెస్ట్

21-09-2026 | 09:40pm

నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్సై శ్రీకాంత్

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 60 గ్రాముల గంజాయిని(ganja) స్వాధీనం చేసుకున్నారు. సముద్రలింగాపూర్ గ్రామ శివారులో నాగంపేట కమన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో ఎస్‌ఐ పి.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటాడి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేసిన వారిలో పెంట మనిశాంత్ (19), బత్తిని సాయి కుమార్ (28) ఉన్నారు. వారి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. పంచుల సమక్షంలో డిజిటల్ తూకం యంత్రంతో తూకం వేయగా సుమారు 60 గ్రాములుగా నిర్ధారించారు. అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విజ్ఞప్తి:

గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

మరిన్ని వార్తలు