నల్లమల అడవిలో ఉడిమెల్ల శాసనం

18-09-2026 | 05:10am

మల్లిదేవరాజు కొడుకు త్రిపురరాజు శాసనం

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నాగర్‌కర్నూలు జిల్లా పదర మండ లం ఉడిమెల్ల గ్రామ పరిధిలోని అడవిలో శిథిల శివాలయం (Ruined Shiva temple)ముందరున్న శాసనఫలకాన్ని చూసి, తెలియజేసినవారు విజయవాడకు చెందిన కార్తీక్. నల్లమలలో క్షేత్రాలు, శాసనాలు, చరిత్రను అన్వేషిస్తున్న వేదాద్రి నల్లగొర్ల ట్రెక్కింగ్ టీమ్ లోనివాడు కార్తీక్ పోతుబోయిన. తనతోపాటు నల్లగొర్ల వేదాద్రి, ఎం.శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, విష్ణు ఈ శాసనం అన్వేషణలో పాల్గొన్నారు. 

ఉడిమెల్ల శాసనపాఠం, సారంశం

1.స్వస్తి సమధిగత పంచమ, 2.హాశబ్ద మహామండ, 3.లేస్వర మణినాగపుర, 4. వరేశ్వర హారీతిగోత్ర అ, 5.(ద్వి)దంతి సహస్రా(ణి)....(కొ), 6.ద్వంతు వాజిణం యనంతం పాద, 7.సంభూతం మిత్యేతే మాదవర్మ, 8.ప్రతాపులైన శ్రీమన్మహామండలేస్వర, 9.మల్లిదేవరాజుకొడ్కు(త్రి)పురరా, 10. జులు 199(0)యగు తారణ సంవ, 11.త్సరమున పౌష్యసుద్ద దసమి సు, 12.క్రవారమన నుత్తరాయణ సం, 13.క్రమణ కాలమ్న శ్రీఉడుమిస్వ, 14.రదేవరకు దూపదీపనివేద్యా, 15.కు విసాలాక్షి జియ్యేల సమ, 16. ఉడుమిడ్ల దీపాలుదేవరకు నిచ్చిన, 17.దత్తి11 స్వదత్త పరదత్తం వాయో, 18.హరేతి వసుంధరాం షష్టిర్వర్ష, 19.సహస్రాణి విష్టాయాం, 20. (జాయతే క్రిమిః). ఉడిమెల్లలో లభించిన శాసనంలో మణినాగపురవరేశ్వరుడు,

హారీతిగోత్రుడు, వేల గజబలం, అశ్వదళాలు కలిగిన అనంతుని పాదసంభూతుడైన మాధవవర్మ ప్రతాపులైన మల్లిదేవరాజు కొడ్కు త్రిపురరాజులు శాసనంలో పేర్కొన్న శక సం.(1990) తప్పుగా వుంది, కానీ శాసనంలోని తారణ సం. పౌష్య శుద్ధ దశమి, శుక్రవారం, ఉత్తరాయణ సంక్రమణ కాలానికి సరిపోయే తేది: 1404 డిసెంబర్ 14వ రోజు. ఆరోజు  ఉడుమిడ్లలోని ఉడుమీశ్వరదేవరకు ధూప, దీప, నైవేద్యాలకు విశాలాక్షి జియ్యేలు దేవరకు ఇచ్చిన దత్తి అంటే దానం.  ఈ శాసనంలోని ప్రశస్తితో సరిపోలిన ప్రశస్తితో మరొక శాసనం మల్లిదేవరాజు పేరుతో నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, ఆమనగల్లు రామలింగేశ్వరస్వామి గుట్టమీద లభించింది.

ఆ శాసనం ‘కొత్త తెలంగాణ శాసనాలు’ పుస్తకంలో (54వ శాసనం, పేజి-177) ప్రచురించబడ్డది. ఆమనగంటి శాసనంలో ప్రస్తావించబడిన మల్లిదేవరాజు శాసనంలో పేర్కొన్న కొండపల్లి అంటే నేలకొండపల్లి పాలకుడు. ఆమనగల్లు శాసనం మల్లిదేవరాజు కాలంలో వేసినది. ఉడిమెల్ల శాసనం అతని కొడుకు త్రిపురరాజులు వేయించినది. మొదటిసారి ‘మణినాగపురవరేశ్వరుడు’గా పేర్కొనబడ్డవాడు పొలాసపాలకుడు మేడరాజు. మేడరాజు వంశ మూలపురుషుడు మాధవవర్మ. ఉడిమిల్ల శాసనంలో కూడా పేర్కొనబడ్డ మాధవవర్మ వంశంలో ప్రతాపుడైన మల్లిదేవరాజు, అతని కొడుకు త్రిపురరాజులు.

క్షేత్ర పరిశోధన: కార్తీక్ పోతుబోయిన, వేదాద్రి టీమ్-

శాసన పరిష్కరణ: శ్రీరామోజు హరగోపాల్, అధ్యక్షుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

మరిన్ని వార్తలు