నల్లమల జంగల్‌లో సఫారీ!

04-10-2026 | 05:20am

నల్లమల పేరు వినగానే గుర్తుకొచ్చేది దట్టమైన అడవి. ఎత్తున కొండలు. పచ్చని చెట్ల మధ్య నుంచి వినిపించే పక్షుల కిలకిల రాగాలు. ఎక్కడో ఒకచోట కనిపించే వన్యప్రాణుల జాడలు. ఇలాంటి ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు జంగల్ సఫారీ ఓ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. 

ప్రతి మలుపూ ఓ సర్‌ప్రైజ్.. పెద్దపులి జాడ

బొడ్డుపల్లి మల్లయ్య, విజయక్రాంతి, నాగర్‌కర్నూల్: సఫారీ వాహనం(Nallamala Jungle Safari) అడవిబాట పట్టగానే నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచం కళ్లముందు కనిపిస్తుంది. రహదారికి ఇరువైపులా దట్టమైన చెట్లు.. మధ్యమధ్యలో ఎండిన ఆకుల చప్పుడు.. దూరంగా వినిపించే పక్షుల కూతలు.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చే జింకలు.. కోతుల గుంపులు.. నెమళ్లు.. అడవి పందులు.. ఇలా ఏ క్షణంలో ఏ వన్యప్రాణి ఎదురవుతుందో చెప్పలేని ఉత్కంఠే సఫారీ ప్రత్యేకత. 

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌డ్(Amrabad Tiger Reserve) పరిధిలో సఫారీకి వచ్చే పర్యాటకుల ప్రధాన ఆకర్షణ పెద్దపులి. గత మూడు నెలల అనంతరం ప్రారంభమైన సఫరీలో పులి కనిపిస్తుందా దాని పాదముద్రలు కనిపిస్తాయా ఎక్కడైనా గర్జన వినిపిస్తుందా అన్న ఆసక్తితో పర్యాటకుల చూపులు అడవిబాటపైనే ఉంటాయి. పులి కనిపించకపోయినా దాని ఉనికిని సూచించే జాడలు సఫారీకి ప్రత్యేక ఉత్సాహాన్నిస్తాయి.

అడవి అందాలకు మరో కోణం

జంగల్ సఫారీ కేవలం వన్యప్రాణుల వీక్షణ మాత్రమే కాదు. నల్లమల కొండల అందాలు, లోయలు, పచ్చని వృక్ష సంపద, సెలయేళ్లు, రాళ్ల మధ్య ప్రవహించే నీటి ధారలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే ప్రయాణం మంచుతెరల్లో అడవి మరో ప్రపంచంలా కనిపిస్తే.. సాయంత్రం సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి జారిపడే దృశ్యం కెమెరాల్లో బంధించాలనిపిస్తుంది. ఫారహాబాద్, వ్యూ పాయింట్, బయో ల్యాబ్ కనువిందు చేస్తాయి.

అడవిలోకి వెళ్లిన తర్వాత మొబైల్ ఫోన్ మోగకపోయినా పర్వాలేదు.. ప్రకృతి చేసే శబ్దాలే మనసును పలకరిస్తాయి. ఆకుల సవ్వడి, పక్షుల కిలకిల, దూరంగా జంతువుల అలికిడి.. ఇవన్నీ కలసి నల్లమలకే సొంతమైన సహజ సంగీతాన్ని వినిపిస్తాయి. అందుకే జంగల్ సఫారీ ఒక ప్రయాణం మాత్రమే కాదు.. రెండు రోజుల పాటు ప్రకృతితో మనిషికి ఏర్పడే ఓ అనుబంధం.  దసరా, సెలవులు సమీపిస్తున్న వేళ నల్లమల వైపు పర్యాటకుల ఆసక్తి పెరుగుతోంది.

కుటుంబ సభ్యులు, యువత, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి జంగల్ సఫారీ ఓ ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. అడవిని ఆస్వాదించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే అవకాశం కూడా సఫారీ ద్వారా లభిస్తోంది.

నల్లమలలో ప్రతి అడుగూ ఓ కథ.. ప్రతి మలుపూ ఓ ఉత్కంఠ.. ప్రతి చూపూ ఓ జ్ఞాపకం. జంగల్ సఫారీ అంటే అడవిని చూడటం కాదు.. అడవిని అనుభవించడం. ఇందుకు ఆన్లున్ ద్వారా దరఖాస్తు చేసుకుని ముందుగా మన్ననూర్ నుంచి 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర ఆలయం అనంతరం మరుసటి రోజు ఫారహాబాద్ మీదుగా కారడవులోకి జర్నీ ఏంటి అవుతుంది. 

మరిన్ని వార్తలు