బెల్ట్ షాపులు తొలగించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
గ్రామంలో ఇబ్బందులు పెరుగుతున్నాయంటూ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండలం(Tungaturthi Mandal) గానుగుబండ గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని కోరుతూ గానుగుబండ గ్రామంలోని వివిధ యూత్ క్లబ్‌ల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు కలిసి శుక్రవారం సర్పంచ్‌కు వినతిపత్రం అందజేశారు.
బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా మహిళలు, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ సమస్యపై సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తక్షణమే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, గ్రామంలో శాంతియుత వాతావరణం కోసం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న యూత్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.