సింగారంగా శృంగార బావి!
చారిత్రక ఓరుగల్లు నగరంలో కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన మరో అద్భుత కట్టడం శివనగర్ మెట్లబావి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. కాకతీయుల కాలం నాటి విశిష్ట నీటి సాంకేతికతకు, శిల్పకళా ఛాతుర్యానికి నిదర్శనంగా ఈ బావి (శృంగార బావి) నిలుస్తోంది. దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండి, నిరుపయోగంగా మారిన ఈ చారిత్రక సంపదను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది.
మహబూబాబాద్, విజయక్రాంతి: సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయుల(Kakatiyas) పాలనలో ఈ మూడు అంతస్తుల మెట్ల బావిని నిర్మించారు. 14/14 మీటర్ల చతురస్రాకార వైశాల్యంతో నిర్మించిన ఈ బావికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది.
రాణి రుద్రమదేవి కోట (Queen Rudramadevi's Fort)నుండి ఇక్కడికి సొరంగ మార్గం గుండా వచ్చి స్నానమాచరించేవారని చరిత్రకారులు చెబుతారు. అందుకే దీనికి ‘శృంగార బావి’ అనే పేరు స్థిరపడింది. గట్టి గ్రానైట్ రాతి స్తంభాలు, కాకతీయ తోరణాల శైలిని ప్రతిబింబించే శిల్పాలతో మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ కట్టడం అప్పటి అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు అద్దం పడుతోంది.
సాంప్రదాయ పద్ధతుల్లో జీవం
గతంలో రక్షణ లేకపోవడంతో చుట్టుపక్కల వ్యర్థాలు చేరి ఇదొక డంపింగ్ యార్డులా తయారైంది. చారిత్రక ప్రేమికుల విజ్ఞప్తి మేరకు స్పందించిన ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించింది. హైదరాబాద్లోని బన్సీలాల్పేట మెట్ల బావి తరహాలోనే దీనిని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించి అద్భుతంగా తీర్చిదిద్దారు.
డంగు సున్నంతో మరమ్మతులు
ప్రాచీన రాతి కట్టడం దెబ్బతినకుండా ఉండేందుకు ఆధునిక సిమెంట్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేశారు. సాంప్రదాయ పద్ధతిలో కరక్కాయ, బెల్లం, డంగు సున్నం మిశ్రమంతో పగుళ్లను సంధించి స్తంభాలను సరిచేశారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా బావి చుట్టూ ఇనుప రాడ్లతో కూడిన రక్షణ ప్రహరీని నిర్మించారు. రాత్రి వేళల్లో బావి అందాలు ఉట్టిపడేలా అద్భుతమైన ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను అమర్చారు.
ఈ బావి పునరుద్ధరణ ద్వారా కేవలం పర్యాటక రంగమే కాకుండా, శివనగర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరగడానికి దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు. వర్షపు నీటిని నిల్వ చేసేలా దీన్ని రీఛార్జ్ సోర్స్గా మార్చారు. వేల ఏళ్ల నాటి చారిత్రక సంపదకు ప్రభుత్వం పునర్జీవం పోయడం పట్ల ఓరుగల్లు నగర వాసులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కోటను సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన అద్భుతమైన చారిత్రక వేదికగా ఇప్పుడు శివనగర్ మెట్ల బావి నిలుస్తోంది.
బండి సంపత్‌కుమార్,