గురుకులంలో నీటి గోస!

08-09-2026 | 05:00am
  1. కొయ్యగుట్టలో చెడిపోయిన బోరు మోటారు..
  2. చేతులెత్తేసిన అధికారులు..
  3. ట్యాంకర్లతో నెట్టుకొస్తున్న వైనం.. 
  4. నీటి కొరతతో విద్యార్థినుల అవస్థలు..
  5. జ్వరాల బారిన పడుతున్నా పట్టించుకునేవారే లేరా...?

బాన్సువాడ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం కొయ్యగుట్ట బాలికల గురుకుల పాఠశాల(Koyyagutta Girls Gurukul School), కళాశాల ఆడపిల్లల కోసం ఏర్పాటు చేసిన గురుకులంలో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితి నెలకొంది. బోరు మోటారు చెడిపోవడంతో విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గురుకులంలో 600 వందల మంది విద్యార్థినీలు ఉంటున్న నేపథ్యంలో వారి రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందక తాగునీరు, స్నానాలు, పారిశుద్ధ్య నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి రావడంతో ఎప్పుడు నీరు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆడపిల్లలు చదువుకునే గురుకులంలో కనీస మౌలిక వసతులైన నీటిని కూడా అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బోరు మోటారు మరమ్మతుకు ఇంత సమయం ఎందుకు పడుతోంది? తాత్కాలికంగా ట్యాంకర్లతో నీటిని అందించడం తప్ప శాశ్వత పరిష్కారంపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నీటి సమస్యతో ఆరోగ్యంపై ప్రభావం?

ఇప్పటికే పలువురు విద్యార్థినీలు జ్వరాల బారిన పడుతున్నారని సమాచారం. గురుకులంలో నీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థినీల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓల్లు నొప్పులు కీళ్ల నొప్పులతో తీవ్ర జ్వరాన బారిన పడుతున్నామని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పలుమార్లు తెలియజేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో విద్యార్థినీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మా సమస్యను పరిష్కరించండి..

నీటి కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థినీలు తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నా రు. బోరు మోటారును వెంటనే మరమ్మతు చేయడంతో పాటు గురుకులానికి నిరంతర నీటి సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. విద్యార్థినీల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాంకర్లతోనే నెట్టుకొస్తున్న వైనం!

గురుకుల పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు అవసరమైన స్థాయిలో నీటి సరఫరా అందకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.విద్యార్థుల తాగునీరు, వంట, పారిశుద్ధ్య అవసరాలకు నిరంతరం నీరు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరాలో అంతరాయం కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

బోరు మోటారు చెడిపోనా పట్టించుకోరా?

గురుకుల పాఠశాలలో బోరు మోటారు పనిచేయకపోయినా అధికారులు మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోరు మోటారు మరమ్మతు చేస్తే నీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో గురుకులంలో నీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.బోరు మోటారు పనిచేయకపోవడంతో విద్యార్థుల అవసరాలకు సరిపడా నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అవసరాలు తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సమాచారం.

నీటి సమస్యను పరిష్కరిస్తాం...

గురుకుల పాఠశాలలో నీటి సమస్య పై విజయ క్రాంతి ప్రిన్సిపాల్ లక్ష్మీబాయిని వివరణ కోరగా నీటి సమస్య ఉన్న మాట వా స్తవమేనని నీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులకు తెలిపాం వారు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అప్పటివరకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రయత్నిస్తున్నాం.

 లక్ష్మీబాయి, ప్రిన్సిపాల్, గురుకుల పాఠశాల, కొయ్యగుట్ట.

మరిన్ని వార్తలు