హిందూ పండుగల పై ఎందుకు ఈ వివక్ష
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముకరంపుర, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): కరీంనగర్ పార్లమెంట్(Karimnagar Parliamentary Constituency) పరిధిలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించాల్సిన ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) విఫలమైందని, వేడుకలకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఘాటుగా విమర్శించారు.
సోమవారం రోజున కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కరీంనగర్లో జరిగే వినాయక నిమజ్జన ఉత్సవానికి అవసరమైన నీళ్లను ప్రాజెక్టుల నుండి విడుదల చేసే విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఆయన ఆరోపించారు.ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని , అయినా కూడా నిన్నటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
హిందూ పండగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ, వినాయక నిమజ్జనం సజావుగా జరగాలనే ఉద్దేశంతో బిజెపి ఆధ్వర్యంలో సోమవారం చింతకుంట కెనాల్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించి , రేవంత్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆందోళనకు దిగివచ్చి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా కెనాల్ కు నీటిని విడుదల చేయించడం జరిగిందని , ఇది ముమ్మాటికి హిందూ ప్రజల విజయమన్నారు.