వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి
జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి
ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి):వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి (District Forest Officer Balamani )అన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం నుంచి గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీని ఆసిఫాబాద్ ఎఫ్ఆర్ఓ గోవింద్ చంద్ సర్దార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ ప్రజల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు 1955 నుంచి జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, ప్రజల సహకారంతోనే జంతువుల సంరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అన్నారు.
గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య కొంత పెరిగిందని, వాటి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, సెక్షన్ అధికారులు మహేందర్, సాయి, మల్లయ్య, సతీష్, గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల పీడీ మీనారెడ్డి, బీట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.