ఎండుతున్న పంటలు.. మండుతున్న గుండెలు!

22-09-2026 | 05:05am
  1. వర్షాలు లేక ఎండుతున్న పత్తి, వరి పంటలు
  2. ఎల్‌నినోపై అవగాహన కల్పించడంలో విఫలమైన వ్యవసాయ అధికారులు
  3. తీవ్రమైన కరెంటు కోతలు, యూరియా కష్టాలు
  4. కరువు మండలంగా ప్రకటించాలంటున్న రైతులు 

సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 21 : ఆరుగాలం శ్రమించి పంట(Crop) పండించే అన్నదాతకు కష్టాల కడలితో ప్రయాణం తప్పడం లేదు. ప్రపంచానికే అన్నం పెట్టే రైతన్న తను మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఒకవైపు యూరియా(Urea) కష్టాలు, అప్రకటిత కరెంటు కోతలతో సతమతమవుతుంటే కాలం కూడా రైతన్న(Farmer)పై కన్నెర్ర చేసిం ది. ఫలితంగా చేతికి అందివచ్చిన పంటచేను నేడు పగుళ్లు పట్టి దర్శనమిస్తుంది.

గతేడాది విస్తారంగా వర్షాలు కురిసి అనుకున్న దానికంటే అధిక దిగుబడి రావడంతో ఈ సారి కూడా వర్షాలు కురిసి పంటలు బాగా పం డుతాయనే ఆలోచనతో జూన్ మాసంలో కురిసిన వర్షాలకే విత్తనాలు నాటుకున్నారు. నారాయణపురం మండలంలో అధిక శాతం వరి, పత్తి కంది పంటలు సాగు చేశారు. 

కాలం చేతిలో మోసపోయిన రైతన్న

మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు విత్తుకున్న విత్తనాలకు తదుపరి వర్షా లు కురవక పోవడంతో విత్తనాలు మొలకెత్త క భూమిలోనే ఎండిపోయాయి.కొన్ని చోట్ల మొలిసిన విత్తనాలు ఆగస్టు చివరి వరకు ఎదుగుదల ఆగిపోయి వాడిపోయింది.అక్కడక్కడ పత్తి చేనుకు డ్రిప్ ద్వారా నీటిని అందించి కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరుబావులలో నీరు తగ్గిపోయింది.చివరకు అది కూడా ఎండిపోయే స్థితికి చేరుకుంది.

ఎల్ నినో పై అవగాహన లేకపోవడంతో..

వ్యవసాయ శాఖ అధికారులు ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు రైతు వేదికల వద్ద అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి క్షేత్ర స్థాయిలో అంతగా ఫలితం లేకుండా పోయింది.అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులను కలిసి పరిస్థితిని వివరించకుండా కేవలం అవగాహన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కొంత మంది రైతులకు మాత్రమే ఎల్ నినో పట్ల అవగాహన కలిగిందని తమకు కూడా ముందే తెలిసి ఉంటే తాము కూడా ఈసారి పంటలను వేసేవాళ్లం కాదని వాపోతున్నారు కొంతమంది రైతులు.

కరెంటు కష్టాలు..!

అప్రకటిత కరెంటు కోతలు అన్నదాత పాలిట శాపంగా మారాయి.అసలే అడుగంటిన నీళ్లకు తోడు కరెంటు కోతలు తీవ్రంగా ఉండడంతో  వరి చేలు ఎండిపోతున్నాయి.కనీసం పది గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

యూరియా యాప్ తో సతమతం..!

వరి చేను నాటుకున్న రైతులకు సరైన సమయంలో పంటలకు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు కలిగి పంట ఎదుగుదల లోపించిందని వాపోతున్నారు రైతులు.యూరియా యాప్ ద్వారా రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని దాన్ని తొలగించి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.

కరువు మండలంగా ప్రకటించాలి..

‘ నారాయణపురం మండలాన్ని కరువుమండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.గత రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి.అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.వ్యవసాయ అధికారులు పత్రికా ప్రకటనలు రైతు వేదికలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.ఇప్పటికైన యూరియా యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలి‘.       

దుబ్బాక భాస్కర్, 

సీపీఐ మండల కార్యదర్శి

మరిన్ని వార్తలు