పృథ్వీ షా నిశ్చితార్థం క్యాన్సిల్.. కారణం ఇదే..!

17-09-2026 | 05:31pm

భారత జట్టుకు దూరమైన యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)కు వ్యక్తిగత జీవితంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మార్చిలో ఆకృతి అగర్వాల్‌(Aakriti Agarwal)తో ఘనంగా జరిగిన ఆయన నిశ్చితార్థం రద్దయింది. భవిష్యత్ లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి వెల్లడించింది.

ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎంతో భారమైన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నట్లు పేర్కొన్న ఆకృతి.. తమ మధ్య పరస్పర గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ భవిష్యత్తులో కలిసి ప్రయాణించలేమని ఇద్దరూ అర్థం చేసుకున్నట్లు తెలిపింది. తమ బాధ్యతలు, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఇది తమ ఇద్దరికీ అత్యంత వ్యక్తిగతమైన, సున్నితమైన విషయమని పేర్కొన్న ఆమె.. ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని కోరింది. నిశ్చితార్థం రద్దుకు గల కారణాలపై ఎలాంటి ఊహాగానాలు, ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది.

ఇదిలా ఉంటే.. భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న పృథ్వీ షాకు వ్యక్తిగత జీవితంలోనూ ఈ పరిణామం ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు